న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో అధికారంలో ఉన్న ఆప్, ప్రతిపక్ష బీజేపీ మధ్య రాజకీయ విమర్శలు తీవ్రమయ్యాయి. యమునా నది కాలుష్యంపై బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ వినూత్నంగా నిరసన తెలిపారు. ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కటౌట్‌ను (Arvind Kejriwal’s cutout) కలుషిత యమునా నదిలో ముంచారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్‌పై పోటీ చేస్తున్న పర్వేష్ వర్మ యమునా నది కాలుష్యంపై తన ప్రచారంలో దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం పార్టీ నేతలు, మీడియాతో కలిసి రెండు బోటుల్లో యమునా నదిలోకి వెళ్లారు. ‘నేను విఫలమయ్యా. నాకు ఓటు వేయవద్దు. 2025 నాటికి యమునా నదిని శుభ్రం చేయడంలో నేను విఫలమయ్యా’ అని ఉన్న కేజ్రీవాల్ పెద్ద కటౌట్‌ను యమునా నదిలో పలుమార్లు ముంచారు.
కాగా, ఈ సందర్భంగా మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ మండిపడ్డారు. కలుషిత యమునా నదిని శుభ్రం చేస్తామని ఇచ్చిన హామీని ఆప్ నెరవేర్చలేదని విమర్శించారు. ‘తల్లి యమునా నీటిని మనం పూర్తిగా శుభ్రం చేయగలం. దానిని శుభ్రం చేయడం రాకెట్ సైన్స్ కాదు. యంత్రాల ద్వారా బురదను తొలగించాలి. మురుగునీరు, నీటి శుద్ధి ప్లాంట్లను నిర్మించాలి. ప్రధాని మోదీ సబర్మతి నదీ తీరాన్ని నిర్మించినట్లే, యమునా నదీ తీరాన్ని కూడా అదే విధంగా నిర్మించవచ్చు. పదకొండు సంవత్సరాలు చాలా ఎక్కువ సమయం’ అని వర్మ అన్నారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ భారీ కటౌట్‌ను పర్వేష్ వర్మ యమునా నదిలో ముంచిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | BJP candidate from the New Delhi assembly constituency, Parvesh Verma reaches Yamuna Ghat; takes a jibe at AAP National Convenor Arvind Kejriwal over the issue of cleaning Yamuna River. pic.twitter.com/uAVHPwOpDx
— ANI (@ANI) January 25, 2025