న్యూఢిల్లీ : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయంతో పార్టీలో అంతర్గత పోరు నెలకొన్న నేపధ్యంలో హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా గురువారం పార్టీ నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. రాహుల్‌తో భేటీ అనంతరం పార్టీ సహచరుడు ఆనంద్ శర్మతో కలిసి రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ను హుడా కలిశారు.
బుధవారం జరిగిన కాంగ్రెస్ రెబెల్ నేతలతో కూడిన జీ-23 భేటీలో ఆజాద్‌తో కలిసి హుడా పాల్గొనడం గమనార్హం. ఆజాద్ నివాసంలో నాలుగు గంటలకు పైగా సాగిన డిన్నర్ భేటీలో అందరినీ కలుపుకునిపోయే సమిష్టి నాయకత్వం అవసరమని 18 మంది నేతలు హాజరైన ఈ సమావేశం పిలుపు ఇచ్చింది. ఇక రాహుల్‌తో సమావేశానంతరం హర్యానా మాజీ సీఎం హుడా ఆజాద్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
జీ-23 నేతల సమావేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఓటమిపై ప్రధానంగా చర్చ జరిగింది. భవిష్యత్ కార్యాచరణపైనా అసంతృప్త నేతలు సమాలోచనలు సాగించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పాలక బీజేపీని ఎదుర్కొనేందుకు కలిసిరావాలని కోరుతూ భావసారూప్య శక్తులతో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసేలా కాంగ్రెస్ నాయకత్వం చొరవ చేపట్టాలని రెబెల్ నేతలు కోరుతున్నారు. పార్టీని సంస్ధాగతంగా ప్రక్షాళన చేయాలని అసంతృప్త నేతలు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి విజ్జ్ఞప్తి చేశారు.