ముంబై ఆగస్టు 5(నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లా సావంత్ వాడి అడవిలో కనిపించిన అమెరికన్ మహిళ లలితా కుమార్ ఎసే కేసులో అసలు విషయం బయటపడింది. మానసిక అనారోగ్యంతో తానే ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించానని, తన భర్త తనను అడవిలో కట్టి వేసినట్టు అబద్ధం చెప్పానని ఆమె అంగీకరించింది. అయితే, అర్ధాంతరంగా జీవితాన్ని ముగించడం తప్పు అని భావించి, రక్షించమని తాను అరచినట్లు తెలిపింది.
తనకు పెండ్లి కాలేదని, గత పదేళ్లుగా తమిళనాడులో ఉంటున్నానని ఆమె చెప్పింది. సోనుర్లీ అడవిలో గొలుసులతో బంధించబడిన లలిత కేసును దర్యాప్తు చేసినపుడు తమిళనాడు పోలీసులకు ఆమె చెప్పిన చిరునామా తప్పు అని తేలింది. ఆ మహిళ తన మాజీ భర్తగా పేరొన్న వ్యక్తి ఎవరూ తమిళనాడు చిరునామాలో లేనట్లు వెల్లడైంది. అమెరికన్ ఎంబసీ పర్యవేక్షించిన ఈ కేసులో లలితా కుమార్ నిజం ఒప్పుకోవడంతో రత్నగిరి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.