హైదరాబాద్, ఫిబ్రవరి 3 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ‘ఇనుములో హృదయం మొలిచెలే..’ అంటూ రోబో చిత్రంలో పాట పాడినట్టే ఓ చిప్‌లో సూక్ష్మమైన ఓ కృత్రిమ మనిషి గుండెను అమెరికా శాస్త్రవేత్తలు అమర్చారు. క్యాన్సర్ చికిత్సకు ఈ విధానం ఎంతగానో సాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు లాస్ఎంజెలిస్లోని సెడార్స్-సినాయి మెడికల్ సెంటర్ పరిశోధకులు వెల్లడించారు.
క్యాన్సర్ చికిత్సలో ప్రాథమికంగా క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకొని మందులను వాడుతారు. అయితే, ఈ విధానంతో కొందరు గుండె జబ్బుల బారిన పడుతున్నట్టు పలు కేసుల్లో రుజువైంది. దీనికి పరిష్కారాన్ని కనుగొన్న అమెరికా పరిశోధకులు మనిషి మూలకణాలతో ఓ కృత్రిమ గుండెను ప్రయోగశాలలో తయారు చేశారు. దీన్ని ఓ చిప్‌పై అమర్చి కృత్రిమమేధ (ఏఐ) సాయంతో విశ్లేషించారు.
తద్వారా క్యాన్సర్ చికిత్స కోసం వాడే మందులు ఈ గుండెపై ఎలా ప్రభావితం చూపిస్తున్నాయన్న దాన్ని కనిపెట్టారు. ఈ ఫలితాలను బట్టి గుండెజబ్బులు రాకుండా ఏ ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకురావాలన్న దానిపై కసరత్తు మొదలుపెట్టారు. ఈ విధానం క్యాన్సర్ చికిత్సలో గొప్ప ముందడుగు అని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు.