జైపూర్, జూన్ 11: బంగారు పూత పూసిన వెండి నగలను నిజమైన బంగారు నగలుగా నమ్మించి ఓ అమెరికన్ మహిళను నిలువునా మోసం చేశాడు జైపూర్ వ్యాపారి. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితురాలు రాజస్థాన్‌కు వచ్చి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం.. బాధితురాలు కొన్న నగల అసలు విలువ రూ.300 కాగా.. ఆమె అతడికి చెల్లించింది రూ.6 కోట్లు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బాధితురాలు చెరిష్ వాటిని అమెరికాలో ప్రదర్శనకు ఉంచినప్పుడు ఈ మోసం బయటపడింది.
బాధితురాలికి 2022లో ఇన్స్టాగ్రామ్ ద్వారా సోనీ పరిచయమయ్యాడు. ఈ రెండేండ్లలో ఆమె చాలా నగలు అతడి నుంచి కొనుగోలు చేసింది. వీటన్నింటికీ ఆమె రూ.6 కోట్లకు పైగా చెల్లించింది. నిందితుడు తన తండ్రితో కలిసి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నకిలీ నగలకు అసలైన బంగారు నగలుగా ధ్రువీకరణ పత్రం జారీ చేసిన నంద్కిశోర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.