SEBI | న్యూఢిల్లీ, మే 19: మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో మరింత పారదర్శకత కోసం క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చేసిన కొత్త ప్రతిపాదన.. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ)ల లాభాలకు కోత పెడుతున్నది. ఇప్పటికే డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన పన్ను విధానంలో మార్పుల కారణంగా ఏఎంసీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే రకమైన టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్)ను సెబీ ప్రతిపాదించింది. దీనివల్ల ఏఎంసీల లాభాలు 13 శాతం లేదా రూ.1,400 కోట్లు పడిపోనున్నాయని శుక్రవారం విడుదలైన జెఫ్రీస్ నివేదిక తెలిపింది. మ్యూచువల్ ఫండ్ స్కీం కార్పస్ పర్సంటేజీనే టీఈఆర్.
దీని ఆధారంగానే మదుపరుల వద్ద మ్యూచువల్ ఫండ్ సంస్థలు చార్జీలు వసూలు చేస్తాయి. అయితే ఈ చార్జీలకు సెబీ పరిమితిని తెస్తున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.30,800 కోట్ల ఖర్చులుపోను ఏఎంసీల ప్రీ-ట్యాక్స్ ప్రాఫిట్ రూ.10,900 కోట్లుగా ఉన్నది. అయితే సెబీ కొత్త టీఈఆర్ ప్రతిపాదనల ప్రకారం ఈ ఖర్చులకున్న పరిమితి రూ.29,400 కోట్లే. దీంతో మిగతా 1,400 కోట్లు లేదా ప్రీ-ట్యాక్స్ ప్రాఫిట్లో 13 శాతం (రూ.1,417 కోట్లు) రికవరీ చేయనున్నారు. ఇది ఏయూఎం సగటులో 4 బేసిస్ పాయింట్లకు సమానం. ఇదిలావుంటే టీఈఆర్పై సెబీ కొత్త ప్రతిపాదన.. అధిక కమీషన్ల కోసం కస్టమర్లకు కొత్త ఫండ్ ఆఫర్లను మ్యూచువల్ ఫండ్ కంపెనీలు అంటగట్టడాన్ని, అనవసరపు స్కీములను ప్రవేశపెట్టడాన్ని నిరోధిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.