న్యూఢిల్లీ: భారత ప్రతిష్ఠాత్మక అధునాతన మధ్య శ్రేణి యుద్ధ విమానం(ఏఎంసీఏ) కార్యక్రమం మరో ముఖ్యమైన అభివృద్ధి మైలురాయిని దాటినట్టు అనిపిస్తున్నది. హైదరాబాద్లోని దుండిగల్లో ఉన్న ప్రత్యేక రాడార్ క్రాస్ సెక్షన్ కొలత కేంద్రంలో పూర్తి స్థాయి ఇంజినీరింగ్ ఎయిర్ ఫ్రేమ్(ఇంజిన్ మినహాయించి మిగతా విమానం) ఉన్నట్టు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. ఈ విమానం స్టెల్త్(నిఘా) పనితీరుకు సంబంధించి భూ-ఆధారిత మదింపు ఇక్కడ జరుగుతున్నదని భావిస్తున్నారు. అయిదో తరం యుద్ధ విమానం అభివృద్ధిలో స్టెల్త్ మూల్యాంకనం అత్యంత కీలకమైన దశల్లో ఒకటిగా పరిగణిస్తారు.
ఇదే ఇప్పుడు రక్షణ రంగ పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది. విమానాలు వివిధ కోణాల నుంచి రాడార్ సంకేతాలను ఎలా ప్రతిబింబిస్తాయో విశ్లేషించడానికి రాడార్ క్రాస్ సెక్షన్ కేంద్రాలను ప్రత్యేకంగా రూపొందించారు. ఇవి రాడార్ గుర్తించే సంకేతాలను గుర్తించి, తగ్గించడంలో ఇంజినీర్లకు సహాయపడతాయి. శత్రు రాడార్ వ్యవస్థలకు విమానాన్ని గుర్తించడం కష్టంగా ఉండేలా చూడటం ద్వారా, విమాన సామర్థ్యాన్ని పెంచడంలో ఈ పరీక్ష ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తుంది.