న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి అశ్వనీ కుమార్ రాజ్యసభ సీటు కోసమే కాంగ్రెస్ను వీడారని ఆ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారీ ఆరోపించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ఆయన కాంగ్రెస్ను వీడటం దురదృష్టకరమని అన్నారు. పంజాబ్ ఎంపీ అయిన మనీష్ తివారీ మీడియాతో బుధవారం మాట్లాడారు. ఒక నాయకుడు పార్టీని వీడితే కాంగ్రెస్కు నష్టం కలుగుతుందన్నారు. పంజాబ్ పార్లమెంట్ మాజీ సభ్యుడైన అశ్వనీ కుమార్ విశిష్ట కేంద్ర మాజీ మంత్రి కూడా అని అన్నారు. దురదృష్టవశాత్తు ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. రాజ్యసభ సీటు కాంక్ష వ్యక్తులతో అనేక పనులు చేయిస్తుందని వ్యాఖ్యానించారు.
కాగా, సుమారు 40 ఏండ్లకుపైగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధమున్న అశ్వనీ కుమార్ ఆ పార్టీకి మంగళవారం రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాజీనామా లేఖ పంపారు. ‘46 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం తర్వాత పార్టీ నుంచి నిష్క్రమిస్తున్నాను. స్వాతంత్ర్య సమరయోధులు ఊహించిన ఉదారవాద ప్రజాస్వామ్యం, గౌరవప్రదమైన వాగ్దానాల ఆధారంగా పార్టీ నాయకత్వంలో మార్పు రావాలని, ప్రజా ప్రయోజనాలు కొనసాగించాలని ఆశిస్తున్నాను’ అని అందులో పేర్కొన్నారు.