న్యూఢిల్లీ, జూన్ 22: హైదరాబాద్ సహా ఆరు నగరాల్లో ఇంటివద్ద నుంచే డయాగ్నోస్టిక్స్ సేవల్ని ప్రారంభిస్తున్నట్టు అమెజాన్ ఇండియా ఆదివారం ప్రకటించింది. అమెజాన్ యాప్ ద్వారా వినియోగదారులు ల్యాబ్ టెస్ట్‌లు, అపాయింట్మెంట్స్ షెడ్యూల్, ట్రాక్ చేయటం, డిజిటల్ రిపోర్టులను పొందటం.. వంటివి చేయవచ్చునని కంపెనీ తెలిపింది.
ఆరెంజ్ హెల్త్ ల్యాబ్స్‌తో కలిపి ఈ సేవల్ని బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ముంబై, హైదరాబాద్ నగరాల్లో ఈ సేవల్ని తీసుకొస్తున్నట్టు అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అమెజాన్ మెడికల్ ద్వారా కంపెనీ తన ఫార్మసీ, క్లినికల్ సేవల్ని అనుసంధానం చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రైమ్, నాన్-ప్రైమ్ మెంబర్స్ అందరూ టెలీమెడిసిన్ కన్సల్టేషన్ సర్వీస్, డెలివరీ బెనిఫిట్స్ పొందవచ్చునని పేర్కొన్నది. అమెజాన్ క్లినిక్ ద్వారా కస్టమర్లు లైసెన్స్డ్ డాక్టర్ల ద్వారా ప్రాథమిక వైద్య చికిత్సలను అందుకోవచ్చునని తెలిపింది.