న్యూఢిల్లీ: అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య గత 52 రోజులుగా సాగిన అమర్నాథ్ యాత్ర సోమవారం శ్రావణ పూర్ణిమతో ముగిసింది. ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు, ఉగ్రదాడుల్ని సైతం లెక్కచేయకుండా అయిదు లక్షల మంది భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నారు. ఈ ఏడాది జూన్ 29న యాత్ర మొదలైంది. రెండు మాసాలు మాత్రమే దర్శనమిచ్చే మంచు లింగాన్ని సాక్షాత్తు కైలాస నాథుడు పరమేశ్వరుడిగా భక్తులు భావిస్తారు.
ఎంపాక్స్‌పై కేంద్రం అప్రమత్తం
న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఎంపాక్స్‌పై కేంద్రం అప్రమత్తమైంది. బొబ్బలు, పొక్కులున్న రోగులను గుర్తించి ఐసొలేషన్ వార్డులో ఉంచాలని దవాఖానలను కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్, లేడీ హార్డింగ్, రామ్ మనోహర్ లోహియా దవాఖానలను నోడల్ హాస్పిటల్స్‌గా ప్రకటించింది. అనుమానిత రోగులకు ఆర్టీ-పీసీఆర్, నాసల్(ముక్కు) స్వాబ్ పరీక్షలు నిర్వహించనున్నారు. విమానాశ్రయాల్లోనూ ముందుజాగ్రత్త చర్యలు తీసుకోనున్నారు.
29 వరకు సిద్ధరామయ్యపై చర్యలొద్దు
‘ముడా’పై హైకోర్టు ఆదేశం
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఆరోపణలు ఉన్న ‘ముడా’ కుంభకోణంలో విచారణను ఆగస్టు 29 వరకు వాయిదా వేయాలని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టును కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. గవర్నర్ మంత్రిమండలి సలహా తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ ఉత్తర్వులను కొట్టేయాలని కోరారు. అయితే, సిద్ధరామయ్య విజ్ఞప్తి చేసినట్టుగా ఇప్పుడు గవర్నర్ ఉత్తర్వులను నిలిపివేస్తూ ఆర్డర్ ఇవ్వడం లేదని హైకోర్టు తెలిపింది.