శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని అమర్నాథ్లో శుక్రవారం సాయంత్రం కుంభవృష్టి కురిసింది. దీంతో కొండ ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. అమర్నాథ్ కొండ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భక్తుల గుడారాలు కొట్టుకుపోయాయి. వరదల్లో చిక్కుకొని పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 40 మంది గల్లంతైనట్లుగా తెలుస్తున్నది. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సిబ్బంది పాలుపంచుకుంటున్నారు. భారీ వరదల కారణంగా అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేశారు. రేపు పరిస్థితుల ఆధారంగా అమర్నాథ్ యాత్ర పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ డీజీ అతుల్ అగర్వాల్ మాట్లాడారు. పెద్ద ఎత్తున వచ్చిన వరదల్లో టెంట్లు కొట్టుకుపోయాయన్నారు. వరదల్లో చిక్కుకొని పది మంది మృతి చెందారని చెప్పారు. వరదల్లో చిక్కుకున్న ముగ్గురిని రక్షించామని, రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు. మరో ఎన్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి వెళ్తోందన్న ఆయన.. సహాయక చర్యల్లో సైన్యం, ఐటీబీపీ సిబ్బంది, పోలీసులు పాలు పంచుకుంటున్నారన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. అయితే, ఆకస్మిక వరదలతో అమర్నాథ్ గుహలో పెద్ద సంఖ్యలో భక్తులు చిక్కుకున్నట్లు సమాచారం. బాధితులను హెలికాప్టర్ ద్వారా తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు.