తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో కొవిషీల్డ్ టీకాకు సంబంధించి కేరళ హైకోర్టు కేంద్ర సర్కారుకు కీలక ఆదేశాలు జారీచేసింది. కొవిషీల్డ్ మొదటి డోస్ వేసుకున్న తర్వాత రెండో డోస్ వేసుకునే గడువును 12 వారాలకు బదులుగా 4 వారాలకు తగ్గించాలని ఆదేశించింది. ఆ మేరకు కొవిన్ యాప్లో కూడా మార్పులు చేయించాలని కేరళ హైకోర్టు సూచించింది.
కేరళలో కేసులు పెరుగుతున్నందున ఫస్ట్ డోసుకు, రెండో డోసుకు మధ్య 12 వారాల సుదీర్ఘ గడువు ఉండటం మంచిది కాదని, అందువల్ల ప్రజలు నాలుగు వారాలకే సెకండ్ డోస్ వేసుకునే అవకాశం కల్పించాలని హైకోర్టు తన ఆదేశాల్లో స్పష్టంచేసింది. కాగా, గతంలో కొవిషీల్డ్ తొలి డోస్ వేసుకున్న తర్వాత నాలుగు వారాలకే రెండో డోస్ వేసేవారు. కానీ ఆ తర్వాత వ్యాక్సిన్ కొరత కారణంగా నాలుగు వారాల గడువును 12 వారాలకు పొడిగించారు.