INDIA Alliance | న్యూఢిల్లీ, డిసెంబర్ 7: కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి దించేయాలన్న ప్రధాన లక్ష్యంతో సుమారు 24 విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి బీటలు వారుతున్నది. ఇప్పటికే కూటమిలో ఉన్న విభేదాలు లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్ఫుటం కాగా, ఇటీవల జరిగిన పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమికి నేతృత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ పట్ల అందులోని పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ‘ఎన్నికల్లో విజయం సాధించి పెట్టలేని నాయకుడిని మనం ఇంకా ఎంతకాలం భరించాలి’ అన్న ధోరణి ఆ పార్టీల్లో ఇటీవల అధికమైంది.
ముఖ్యంగా శివసేన (యూబీటీ), టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీలు శనివారం మమత చేసిన ప్రకటనపై స్పందించాయి. పరోక్షంగా ఆమెకు మద్దతు తెలిపి, కూటమిలో నాయకత్వ మార్పు చేపట్టాలన్న సంకేతాలు ఇచ్చాయి. దానికి తోడు ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో కూటమి పరాజయం, ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఒకే అంశం(అదానీ అవినీతి)పై కాంగ్రెస్ కేంద్రాన్ని నిలదీయడం, అధికార పార్టీ సభను వాయిదా వేయడం తదితర అంశాలు కూటమిలోని మిగతా పార్టీలకు ఏమాత్రం రుచించడం లేదు. దీంతో కూటమికి నేతృత్వం వహిస్తున్న రాహుల్‌ను తప్పించాలని కొన్ని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి.
శుక్రవారం మీడియాతో మాట్లాడిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూటమి నాయకత్వం, సమన్వయం తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘నేను ఇండియా కూటమిని ఏర్పాటు చేశాను. నాకు అవకాశమిస్తే దానిని సాఫీగా నడిసిస్తా. అయితే నేను బెంగాల్‌ను వదిలి బయటకు రావాలనుకోవడం లేదు. ఇక్కడ నుంచే కూటమిని నడపగలను’ అని ఆమె చెప్పారు.
మమత సుముఖతపై శివసేన (యూబీటీ) స్పందించింది. ‘మమత అభిప్రాయం తెలుసుకున్నాం. కూటమిలో ఆమె కూడా ప్రధాన భాగస్వామి కావాలనుకుంటున్నాం. . ఈ విషయంలో త్వరలోనే మమతా బెనర్జీతో కోల్‌కతాలో చర్చలు జరుపుతాం’ అని ఆ పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు. ‘దేశ్ బచావో.. బీజేపీ హఠావో’ అన్నది మన ఉమ్మడి సంకల్పం. అయితే ప్రతి రాష్ట్రంలో పరిస్థితి ఒకేలా లేదన్నది ముఖ్యమైన విషయం’ అని సీపీఎం నేత డీ రాజా తెలిపారు.
రాహుల్‌గాంధీపై కూటమిలోని నేతలకు నమ్మకం లేదన్న విషయం మమత ప్రకటనతో వెల్లడైందనని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి పేర్కొన్నారు.సమాజ్‌వాది పార్టీ నేత ఉదయ్‌వీర్ సింగ్ మమతకు మద్దతు తెలిపారు. మమతా వ్యాఖ్యలపై కూటమిలోకాంగ్రెస్ ఆచితూచి స్పందించింది ‘మమత ఎలాంటి వ్యాఖ్యలు చేసినా దానిపై అందరూ కూర్చుని చర్చించి నిర్ణయించుకోవాలి’ అని కాంగ్రెస్ నేత టీఎస్ సింగ్దోయో అన్నారు. మమత ప్రతిపాదనను కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ జోక్‌గా కొట్టి పారేశారు.
ఎంవీఏ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ శనివారం ప్రకటించింది. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు సన్నిహితుడు మిలింద్ నార్వేకర్ బాబ్రీ కూల్చివేతపై ఇచ్చిన పోస్ట్ దీనికి కారణమని వివరించింది. మసీదును కూల్చివేసి 32 సంవత్సరాలు కాగా, గా మిలింద్ చేసిన పోస్ట్‌లో, మసీదు ఫొటో పెట్టి, శివసేన వ్యవస్థాపకుడు బాలా సాహెబ్ ఠాక్రే వ్యాఖ్యలను జత చేశారు. దీంతో మహా రాష్ట్ర ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకా రాన్ని ఎంవీఏ బహిష్కరించగా, ఇద్దరు ఎస్పీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు.