అలహాబాద్, మార్చి 27 : వివాహితుడైన పురుషుడు ఒక మహిళతో సహజీవనం చేయడం చట్టరీత్యా నేరం కాదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత హక్కులను పరిరక్షించాల్సిన న్యాయస్థానం విధిని సామాజిక నైతికత అధిగమించలేదని కూడా హైకోర్టు పేర్కొన్నది. మహిళ కుటుంబం నుంచి ఎదురవుతున్న బెదిరింపుల నుంచి రక్షణ కోరుతూ ఓ సహజీవన జంట దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు వివాహితుడైన పురుషుడు మేజర్ అయిన మహిళతో పరస్పర అంగీకారంతో సహజీవనం చేసినపుడు ఇందులో ఎలాంటి నేరం లేదని తెలిపింది. వివాహితుడైన పురుషుడు మేజర్ అయిన మరో మహిళతో ఆమె అంగీకారంతో సహజీవనం చేస్తున్నంత మాత్రాన అతనిపై ఎలాంటి నేరం మోపడానికి ఆస్కారం లేదు.
నైతికతను, చట్టాన్ని వేర్వేరుగా ఉంచాలి. చట్టప్రకారం ఎలాంటి నేరం రుజువు కానపుడు పౌరుల హక్కులను పరిరక్షించే విషయంలో న్యాయస్థానం తీసుకునే చర్యలకు సామాజిక అభిప్రాయాలు, నైతికత మార్గదర్శకం కావు అని న్యాయస్థానం పేర్కొన్నది. తన ఇష్టప్రకారమే ఆ వ్యక్తితో కలసి జీవిస్తున్నానని పోలీసు సూపరింటెండెంట్‌కు ఆ మహిళ తెలియచేసిందని, అయినప్పటికీ తన కుటుంబం నుంచి వస్తున్న పరువు హత్య బెదిరింపులపై పోలీసులు చర్య తీసుకోలేదని హైకోర్టు పేర్కొన్నది. ఇద్దరు మేజర్లను రక్షించడం పోలీసుల విధిగా కోర్టు స్పష్టం చేసింది. ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్పీ ఎటువంటి చర్య తీసుకోలేదని పేర్కొన్న హైకోర్టు సహజీవనం చేస్తున్న ఇద్దరు మేజర్లను రక్షించాల్సిన బాధ్యత పోలీసులదని తెలిపింది. ఆ జంటకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత షాజహాన్‌పూర్ ఎస్పీదేనని పేర్కొంటూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు జారీచేసింది.