ప్రయాగ్‌రాజ్: ఉత్తప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా(Kumbh Mela) జరుగుతున్న విషయం తెలిసిందే. మహాకుంభ్‌లో పుణ్య స్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి కోట్లాది సంఖ్యలో భక్తులు అక్కడకు చేరుకుంటున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్ దారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఆ ట్రాఫిక్ వల్ల.. అలహాబాద్ హైకోర్టులో గత కొన్ని వారాల నుంచి కేసులన్నీ పెండింగ్ పడుతున్నాయి. పిటీషన్‌దారులు సమయానికి కోర్టుకు రాలేకపోతున్నారు. గత్యంతరం లేక ఆ కేసులను వాయిదా వేస్తున్నారు.
ఆల్ట్‌న్యూస్ జర్నలిస్టు , ఫ్యాక్ట్ చెకర్ మొహమ్మద్ జుబేర్ దరఖాస్తు చేసుకున్న పిటీషన్‌పై ఇవాళ అలహాబాద్ కోర్టులో విచారణ జరగాల్సి ఉన్నది. ఘజియాబాద్ దస్నా దేవి ఆలయం కేసులో నమోదు అయిన క్రిమినల్ కేసును కొట్టివేయాలని జుబేర్ పిటీషన్ వేశారు. ఆ కేసును అలహాబాద్ కోర్టు వాయిదా వేసింది. కుంభమేళా వల్ల ట్రాఫిక్ జామ్ అధికంగా ఉందని, దీంతో పిటీషనర్లు కోర్టుకు హాజరుకాలేకపోయినట్లు జస్టిస్ సిద్ధార్థ వర్మ, జస్టిస్ యోగేంద్ర కుమార్ శ్రీవాత్సవ్ ధర్మాసనం పేర్కొన్నది.
ట్రాఫిక్ నిబంధనల వల్ల ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేకపోతున్నట్లు కోర్టు తెలిపింది. ఇదే కారణం చేత ఇరు పార్టీలకు చెందిన వారు హాజరుకాలేకపోయినట్లు కోర్టు పేర్కొన్నది. దీంతో జుబేర్‌కు ఫిబ్రవరి 17వ తేదీ వరకు అరెస్టు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించింది.