న్యూఢిల్లీ: సూడాన్‌పై పట్టు కోసం ఆర్మీ, పారా మిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆర్ఎస్ఎఫ్) మధ్య భీకర పోరు జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశంలో విమానాశ్రయాలన్నింటినీ మూసివేశారు. దీంతో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడానికి అవసరమైన అన్ని మార్గాలను భారత్ పరిశీలిస్తున్నది. విమానాల ద్వారా వారు వచ్చే అవకాశం లేనందున భారతీయులను తొలుత ఆ దేశంలోనే సురక్షిత ప్రాంతాలకు రోడ్డు మార్గం ద్వారా తరలించి, అక్కడి నుంచి ఆ దేశ సరిహద్దున ఉన్న దేశాల ద్వారా భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నది.
‘సూడాన్ బాధితులను సురక్షితంగా తరలించడానికి అవసరమైన వివిధ మార్గాలను పరిశీలించాం. ఇందులో భాగంగా జెడ్డా ఎయిర్‌పోర్టులో రెండు ఎయిర్ ఫోర్స్ సీ-130 విమానాలను, సూడాన్ పోర్టులో ఐఎన్ఎస్ సుమేధా ఓడను సిద్ధంగా ఉంచాం’ అని భారత ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే, బాధితుల తరలింపు ప్రక్రియలో భాగంగా 150 మంది పౌరులు సౌదీ అరేబియాకు చేరుకున్నారు. వీరిలో సౌదీ అరేబియన్లే కాక 12 దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. వీరిలో ముగ్గురు భారతీయులు ఉన్నారని, వీరు సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్నారని అక్కడి అధికారులు తెలిపారు. సూడాన్‌లో తాజాగా అంతర్యుద్ధం ప్రారంభమైన తర్వాత 420 మంది ప్రజలు మృతి చెందగా, 3,700 మంది గాయపడ్డట్టు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.