All Party Meeting | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ హౌస్ మెయిన్ కమిటీ గదిలో ఉదయం 11 గంటలకు కేంద్రమంత్రి జేపీ నడ్డా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా నిర్వహించే విషయంపై ప్రభుత్వం అన్ని పార్టీలతో చర్చించింది. సమావేశంలో కేంద్రం ఎనిమిది బిల్లులను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. ఈ సమవేశంలో ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజుజు, సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కేంద్రం తరఫున పాల్గొన్నారు. కాంగ్రెస్ తరఫున గౌరవ్ గొగోయ్, జైరాం రమేశ్, ఎన్సీపీ తరఫున శరద్ పవార్, సుప్రియా సులే, డీఎంకే తరఫున టీఆర్ బాలు, ఆర్పీఐ తరఫున కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఈ సమావేశానికి హాజరయ్యారు. వర్షాకాల సమావేశంలో జుల 21 నుంచి మొదలై ఆగస్టు 21 వరకు సాగనున్నాయి. ఆగస్టు 12 నుంచి 18 వరకు సభా కార్యకలాపాలు జరుగవు.
ఇదిలా ఉండగా.. అఖిలపక్ష సమావేశంలో కేంద్రాన్ని మూడు ప్రశ్నలు అడిగిందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తెలిపారు. ఈ సారి ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ ద్వారా దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతారని తాము ఆశిస్తున్నామని తెలిపింది. ప్రభుత్వం తన అంశాలన్ని ముందుకు తీసుకురావాల్సిన అనేక కీలకమైన అంశాలు ఉన్నాయన్నారు. పహల్గామ్, దానిపై లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన ప్రకటక తీవ్రమైందన్నారు. చాలా సమయం గడిచిపోయిందని.. ఈ సారి ప్రభుత్వం దీనిపై పార్లమెంట్లో కేంద్రం వైఖరి స్పష్టంగా తెలుపాలని డిమాండ్ చేశారు. రెండో అంశం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన అని తెలిపారు. భారత్ గౌరవాన్ని, మన సైన్యం ధైర్యాన్ని ప్రశ్నించే లక్ష్యంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని.. దీనిపై ప్రధాని మాత్రమే సమాధానం చెప్పగలరన్నారు. మూడో అంశం ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిందని చెప్పారు.
రాబోయే రాష్ట్ర ఎన్నికలు, ప్రజాస్వామ్య నిర్మాణంపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. ఈ విషయంలో ప్రధాని సమాధానం ఇవ్వాలన్నారు. అలాగే, రక్షణ, విదేశాంగ విధానంపై మోదీ సభలో ప్రసంగించాలన్నారు. మణిపూర్‌కు సంబంధించిన అనేక బిల్లులను ప్రభుత్వం తీసుకువస్తోందని, కానీ కొన్ని నెలల్లో మణిపూర్‌లో శాంతి తిరిగి వస్తుందని ప్రధాని గతంలో చెప్పారన్నారు. రెండున్నర సంవత్సరాలు గడిచినా అశాంతి కొనసాగుతుందన్నారు. ప్రధానమంత్రి చిన్న దేశాలను సందర్శిస్తుంటారని.. కానీ, ఇప్పటికే దేశంలోని చిన్న రాష్ట్రానికి వెళ్లడం లేదన్నారు. ఆయా అంశాలపై ప్రధాని సభలో తన వైఖరిని స్పష్టం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. అఖిల పక్ష సమావేశానికి హాజరైన తర్వాత, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ అఖిల పక్ష సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న జేపీ నడ్డా అనుమతితో మరో కీలకమైన సమావేశానికి వెళ్తున్నట్లు తెలిపారు. తమ పార్టీ తరఫున లేవనెత్తిన అంశం ఏమిటంటే.. వాణిజ్య ఒప్పందం పేరుతో కాల్పుల విరమణ ప్రకటించేలా చేశానని ట్రంప్ చెబుతున్నారని.. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశామన్నారు. అలాగే, ఢిల్లీలో మురికివాడలను కూల్చివేశారని ఈ అంశంపై సైతం చర్చించాలని కోరామన్నారు.