జమిలిని స్వాగతించిన బీజేపీ, మిత్రపక్షాలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ఎన్డీఏలోని బీజేపీ సహా ఇతర మిత్ర పక్షాలన్నీ జమిలి ఎన్నికలపై కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని ఆహ్వానించాయి. తెలుగుదేశం, జనతాదళ్ (యునైటెడ్), ఎల్జేపీ (రామ్ విలాస్), జేడీఎస్, శివసేన (షిండే వర్గం) పార్టీలు కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని సమర్థించాయి. జమిలి ఎన్నికలతో ప్రజాధనం ఆదా అవుతుందని, అభివృద్ధి వేగవంతమవుతుందని పేర్కొన్నాయి. ఇది దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న అతిపెద్ద నిర్ణయంగా ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ అభిప్రాయపడ్డారు. దేశం తరుచూ ఎన్నికల్లో కూరుకుపోకుండా ఇది అడ్డుకుంటుందని జేడీయూ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ అన్నారు. ఇది చారిత్రక అడుగుగా కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి పేర్కొన్నారు. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం దేశానికి ఓ గేమ్ చేంజర్‌గా మారుతుందని శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే చెప్పారు.
జమ్ముకశ్మీర్ తొలి దశలో 59% పోలింగ్
జమ్ము: జమ్ముకశ్మీర్ తొలి దశ ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. మునుపెన్నడూ లేనంతగా.. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాలో విస్తరించిన 24 అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్ నిర్వహించగా, 59 శాతం ఓటింగ్ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) పీకే పోలి మీడియాకు తెలిపారు. కిష్ట్వార్ జిల్లాలో అత్యధికంగా 77శాతం, పుల్వామాలో అత్యల్పంగా 46శాతం పోలింగ్ నమోదైనట్టు చెప్పారు.