న్యూఢిల్లీ : నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ దగ్గు మందు డాక్1 మ్యాక్స్‌లో కల్తీ జరిగిందనే రిపోర్ట్స్‌తో కంపెనీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కార్యకలపాలను గురువారం రాత్రి నిలిపివేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయం వెల్లడించారు. మారియన్ బయోటెక్ తయారుచేసిన ఈ మందును వాడిన అనంతరం ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది చిన్నారులు మరణించారని ఆరోపణలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) తనిఖీల అనంతరం మారియన్ బయోటెక్ కార్యకలాపాల నిలిపివేత ఉత్తర్వులు జారీ అయ్యాయని మంత్రి పేర్కొన్నారు. మారియన్ బయోటెక్ కార్యకలాపాలు నిలిపివేశామని, ఈ వ్యవహారంలో తదుపరి దర్యాప్తు జరుగుతున్నదని ట్వీట్ వెల్లడించింది. ఈ కంపెనీకి డాక్1 మ్యాక్స్ సిరప్ తయారీకి లైసెన్స్ జారీ చేయగా, ట్యాబ్లెట్లను ఎగుమతి చేసేందుకు యూపీ డ్రగ్స్ కంట్రోలర్ ఆమోదం తెలిపింది.
మారియన్ బయోటెక్ తయారుచేసిన దగ్గు మందు డాక్ 1 మ్యాక్స్‌ను తీసుకున్న అనంతరం తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ 18 మంది చిన్నారులు మరణించారని ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం పేర్కొంది. సమర్కంద్ సిటీలో చిన్నారుల మరణాలు చోటుచేసుకున్నాయని సమాచారం.