న్యూఢిల్లీ, జనవరి 9: కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఫిబ్రవరి 24, 25న దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తామని అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం (ఏఐబీఓసీ) హెచ్చరించింది. బ్యాంకు ఉద్యోగులకు అయిదు రోజుల పని దినాలు, పీఎల్ఐ(ప్రతిభ ఆధారిత ప్రోత్సాహకాలు), పనితీరు సమీక్షపై ఆర్థిక సేవల విభాగం జారీ చేసిన తాజా మార్గ దర్శకాలను ఉపసంహరించుకోవాలని సంఘం డిమాండ్ చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో(పీఎస్బీలు) సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని కోరింది. అవసరమైతే కఠిన కార్యాచరణకు దిగుతామని.. ఈ నెలలో బంద్ నోటీస్ ఇచ్చిన తర్వాత ధర్నాలు మొదలవుతాయని వెల్లడించింది. పీఎస్బీల విధాన నిర్ణయాలను ఆర్థిక సేవల శాఖ ఎక్కువగా నియంత్రించాలని చూడటం ఆయా పీఎస్బీ పాలక మండళ్ల స్వయం ప్రతిపత్తిని దెబ్బ తీస్తున్నదని ఏఐబీఓసీ ఆరోపించింది.