మంగళవారం 19 జనవరి 2021
National - Dec 27, 2020 , 01:23:49

ఒక్కటై.. ఓడిద్దాం

ఒక్కటై.. ఓడిద్దాం

  • బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ యూపీఏలోకి రావాలి
  • అప్పుడే బలమైన ప్రత్యామ్నాయం ఏర్పడుతుంది
  • గట్టి ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం ఉండదు
  • సామ్నా వేదికగా శివసేన పిలుపు

ముంబై: కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ పూర్తిగా బలహీనపడిందని, శివసేన సహా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ యూపీఏ గొడుగు కిందకు చేరి బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయంగా మారాలని శివసేన తన అధికార పత్రిక సామ్నాలో పేర్కొన్నది. కేంద్రంలో బలమైన ప్రతిపక్షం లేకపోవడం వల్లే బీజేపీ ప్రభుత్వం రైతుల పట్ల దారుణంగా, మొండిగా వ్యవహరిస్తున్నదని ఆరోపించింది. బీజేపీపై ఆరోపణలకు పరిమితం కాకుండా కేంద్రంలోని ప్రధాన ప్రతిపక్షం (కాంగ్రెస్‌) నాయకత్వం విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికింది. బలమైన ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమైపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. 

ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్‌ మద్దతివ్వాలి

బీజేపీతో పోరాడుతున్న ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్‌ మద్దతివ్వాల్సిన అవసరం ఉన్నదని శివసేన అభిప్రాయపడింది. ‘పశ్చిమ బెంగాల్‌లో మమతాబెనర్జీ ఒంటరిగా బీజేపీపై పోరాడుతున్నారు. మద్దతుగా       ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ బెంగాల్‌ వెళ్తున్నారు. అయితే ఇది కాంగ్రెస్‌ నాయకత్వంలో జరగాల్సిన పని’ అని వ్యాఖ్యానించింది. ప్రస్తుత యూపీఏలో భాగస్వాములు కానీ ఎన్నో ప్రాంతీయ పార్టీలు బీజేపీ పట్ల వ్యతిరేకతతో ఉన్నాయని, అవి యూపీఏలో చేరకపోతే కేంద్రంలో బలమైన  ప్రత్యామ్నాయంగా ఎదగడం సాధ్యం కాదని సూచించింది. 

సమయం మించిపోతున్నది

కాంగ్రెస్‌ తన పరిస్థితిని మరింత దిగజారకుండా జాగ్రత్తపడాలని సూచించింది. ‘కాంగ్రెస్‌ను ఎవరు నడిపిస్తారన్న దానిపై అయోమయం, యూపీఏ భవిష్యత్తు ఏంటన్నదానిపై సందిగ్ధత నెలకొన్నది. సమయం మించిపోతున్నది. కాంగ్రెస్‌ ఇకనైనా అప్రమత్తమై సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ప్రతీ ఒక్కరికి ఇబ్బందులు తప్పవు’ అని సామ్నా హితవు పలికింది. 

ఉద్యమంలోకి మరింతమంది రైతులు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నెల రోజులుగా అలుపెరుగకుండా సాగుతున్న రైతు ఉద్యమంలోకి మరింత మంది రైతులు వచ్చి చేరుతున్నారు. పంజాబ్‌కు చెందిన వందల మంది రైతులు వేర్వేరు బృందాలుగా నిత్యావసర సరుకులతో ఢిల్లీకి బయలుదేరారు. 

ఎన్డీఏకు ఆర్‌ఎల్పీ గుడ్‌బై

జైపూర్‌:  కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్డీఏ నుంచి రాష్ట్రీయ లోక్‌ తాంత్రిక్‌ పార్టీ (ఆర్‌ఎల్పీ) తప్పుకున్నది. ‘ఎన్డీఏతో మేము ఫెవికాల్‌ పెట్టుకొని ఏమీ అతుక్కోలేదు. కూటమి నుంచి మేము తప్పుకొంటున్నాం’ అని ఆర్‌ఎల్పీ కన్వీనర్‌ హనుమాన్‌ బేనీవాల్‌ శనివారం ప్రకటించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీకి యాత్ర నిర్వహిస్తామన్నారు. రాజస్థాన్‌లో బీజేపీతో కలిసి ఆర్‌ఎల్పీ ఇప్పటివరకు పని చేస్తూ వచ్చింది.