న్యూఢిల్లీ: మద్యం వినియోగానికి సురక్షితమైన పరిమితి ఏమీ లేదని, ఎంత స్వల్ప పరిమాణంలో మద్యాన్ని స్వీకరించినా ఆరోగ్యానికి హానికరమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. పేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ లాంటి సాధారణ క్యాన్సర్లు సహా దాదాపు ఏడు రకాల క్యాన్సర్లకు ఆల్కహాల్ కారణమవుతున్నట్టు గతంలోగుర్తించిన అంతర్జాతీయ కాన్సర్ పరిశోధనా సంస్థ తాజాగా అన్నవాహిక, కాలేయ, కొలొరెక్టల్ క్యాన్సర్లకు కూడా ఆల్కహాల్‌తో సంబంధం ఉన్నట్టు తేల్చింది. ఆల్కహాల్ సగటు వినియోగం రోజుకు 20 గ్రాముల కంటే తక్కువగా ఉండే యూరప్ ఖండంలో సైతం 2017లో కొత్తగా 23 వేల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని, వీటిలో సగం కేసులు ఆల్కహాల్ వినియోగానికి సంబంధించినవేనని డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నది. ఆల్కహాల్‌కు సంబంధించిన మొత్తం క్యాన్సర్ కేసుల్లో సగం మహిళల రొమ్ము క్యాన్సర్ కేసులేనని తెలిపింది.