Alamgir Alam : మనీలాండరింగ్ కేసులో గత నెలలో అరెస్టయిన జార్ఖండ్ కాంగ్రెస్ నేత ఆలంగీర్ ఆలం ఇవాళ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా జార్ఖండ్ అసెంబ్లీ కాంగ్రెస్ పక్షనేత పదవికి కూడా ఆయన రాజీనామా సమర్పించారు. అలంగీర్ ఆలం రాజీనామా చేసిన విషయాన్ని జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ ఠాకూర్ ధృవీకరించారు.
ఆలంగీర్ నుంచి అన్ని మంత్రి పదవులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంపాయి సోరెన్ తీసుకున్న మూడు రోజుల అనంతరం ఆయన రాజీనామా లేఖ ఇచ్చారు. ఆలంగీర్ గ్రామీణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలు, గ్రామీణ పనులు, పంచాయితీ రాజ్ లాంటి నాలుగు శాఖల బాధ్యతలు చూసుకునేవారు. ఈ క్రమంలో మనీలాండరింగ్ కేసులో ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది.
గత నెల 6న అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి అయిన సంజీవ్ లాల్ ఇంట్లో పనిచేసే జహంగీర్ ఆలం ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో రూ.37 కోట్ల భారీ నగదు పట్టుబడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో అలంగీర్ ఆలంతోపాటు సంజీవ్ లాల్‌ను కూడా ఈడీ అదుపులోకి తీసుకుంది.