లక్నో: బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లో ప్రజా సమస్యలను ఎండగట్టేందుకు సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన అఖిలేష్ యాదవ్ సోమవారం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం ముందు ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతు సమస్యలు, శాంతి భద్రతలు లోపించడం, రోడ్ల దుస్థితి వంటి ప్రజా సమస్యలపై భారీ నిరసన ర్యాలీ తలపెట్టారు. అయితే అఖిలేష్ యాదవ్, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని, ఆ పార్టీ నిర్ణయించిన మార్గంలో ర్యాలీని అనుమతించబోమని తెలిపారు. దీంతో పోలీసులు అడ్డుకున్న చోటనే అఖిలేష్ యాదవ్, ఆ పార్టీ నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. కొంత సేపటి తర్వాత పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
అనంతరం సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఒక ట్వీట్ చేసింది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో అసెంబ్లీ వరకు ఆ పార్టీ చేపట్టిన భారీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్న వీడియోను పోస్ట్ చేసింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించింది.
लोकतंत्र की हत्या कर रही भाजपा सरकार!
महंगाई, बेरोज़गारी के खिलाफ पैदल मार्च कर रहे माननीय राष्ट्रीय अध्यक्ष श्री अखिलेश यादव जी को विधानसभा जाने से रोका जाना बेहद शर्मनाक। pic.twitter.com/bo3r5u46AJ
— Samajwadi Party (@samajwadiparty) September 19, 2022