బాబాయ్- అబ్బాయ్ మళ్లీ విడిపోవడానికి సిద్ధమైపోయారట. అఖిలేశ్ యాదవ్ వ్యవహార శైలి శివపాల్ యాదవ్‌కు ఏమాత్రం నచ్చడం లేదట. అందుకే పొత్తుకు గుడ్‌బై చెప్పేయనున్నారని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం అఖిలేశ్ యాదవ్‌తో శివపాల్ భేటీ అయ్యారు. పార్టీలో ప్రముఖ పాత్ర కావాలని డిమాండ్ చేశారు. దీనికి అఖిలేశ్ ససేమిరా అంగీకరించలేదు.దీంతో శివపాల్ అలిగినట్లు ప్రచారం జరుగుతోంది.
ఆ తర్వాత నూతనంగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి శివపాల్‌ను కూడా ఆహ్వానించారు. అయితే శివపాల్ డుమ్మా కొట్టారు. ఎక్కడో భాగవత కథ వింటూ కూర్చున్నారు. దీంతో అందరికీ అర్థమైపోయింది. ఇద్దరి మధ్యా చెడిందని. ఆ తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా శివపాల్ అందరితో చేయలేదు. విడిగానే ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం వెంటనే ఆయన సీఎం యోగితో భేటీ అయ్యారు. ఈ భేటీ 20 నిమిషాల పాటు సాగింది. ఈ భేటీ కేవల మర్యాద పూర్వక భేటీయే అని బయటికి చెబుతున్నా… అఖిలేశ్‌పై కుతకుత కారణంగానే శివపాల్ యోగితో భేటీ అయ్యారని బహిరంగ రహస్యమే.
ఎన్నికల సందర్భంగా సమాజ్ వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ప్రగతిశీల సమాజ్‌వాదీ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ మధ్య పొత్తు కుదిరింది. అయితే అఖిలేశ్ మాత్రం శివపాల్‌కు ఒకే ఒక్క సీటు ఇచ్చారు. అప్పుడే శివపాల్ యాదవ్ అలిగారు. ఆ తర్వాత ఎన్నికల ఫలితాల్లో సమాజ్‌వాదీ ఓడిపోయింది. బీజేపీ గెలిచింది. ఆ తర్వాతి నుంచి ఇద్దరి మధ్యా సంబంధాలు ఏమాత్రం బాగోలేవు.