లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌ను (Sambhal) సందర్శించేందుకు ఆ రాష్ట్రంలో ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ప్రయత్నించింది. మొఘల్ కాలం నాటి షాహి జామా మసీదులో సర్వే నేపథ్యంలో నవంబర్ 24న అక్కడ హింస చెలరేగింది. రాళ్లు రువ్వి, వాహనాలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ హింసాకాండలో నలుగురు వ్యక్తులు మరణించగా పోలీసులతో సహా 30 మందికిపైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ హింసపై దర్యాప్తు కోసం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత మాతా ప్రసాద్ పాండే నేతృత్వంలో 15 మంది సభ్యులతో బృందం ఏర్పాటైంది. శనివారం ఎస్పీ బృందం సంభల్ చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. బయట వ్యక్తులు సంభల్‌లో ప్రవేశించకుండా డిసెంబర్ 10 వరకు నిషేధ ఆదేశాలను ఆ జిల్లా యంత్రాంగం జారీ చేసినట్లు ఆ బృందానికి తెలిపారు.
కాగా, తమ పార్టీ బృందాన్ని సంభల్‌లోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకోవడంపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. నిషేధం విధించడం బీజేపీ ప్రభుత్వ పరిపాలన, ప్రభుత్వ నిర్వహణ వైఫల్యమని విమర్శించారు. సంభల్‌లో అల్లర్లు సృష్టించాలని కలలు కన్న వారిపై ప్రభుత్వం ముందే నిషేధం విధించి ఉంటే మత సామరస్యం, శాంతియుత వాతావరణానికి భంగం కలిగి ఉండేది కాదన్నారు. నిర్లక్ష్యం, కుట్ర పూరితంగా వ్యవహించిన సంభాల్‌లోని మొత్తం పరిపాలనా యంత్రాంగాన్ని సస్పెండ్ చేయాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.