పుణే, సెప్టెంబర్ 17: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి నేతల్లో పదవుల కోసం ఆరాటం మొదలైంది. కూటమి నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ తొలిసారి తనకు ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న మక్కువను బహిరంగంగా వ్యక్తం చేశారు. తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని ఆసక్తిగా ఉన్నట్టు చెప్పారు. పుణేలోని ప్రతిష్టాత్మక దగ్దుష్వేత్ హల్దాయ్ గణపతి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ప్రతి వారు తమ నేత ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. నేను కూడా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాను. అలా అని అందరి కోరికా నెరవేరదు. సీఎం కావాలంటే మెజారీటీ సీట్లు రావాలి. అదంతా ప్రజల చేతుల్లో ఉంది. ముఖ్యంగా 145 మ్యాజిక్ ఫిగర్ పొందడం చాలా అవసరం’ అని అన్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో బీజేపీ, శివసేన, ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమి పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.