ముంబై: శరద్ పవార్ (Sharad Pawar) నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో లుకలుకలు తీవ్రమైనట్లు కనిపిస్తున్నది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) పార్టీని వీడనున్నారనే వార్తలు గతకొన్నిరోజులుగా ప్రచారం జోరందుకున్నది. అదేమీ లేదంటూ ప్రకటిస్తున్న ఆయన.. శుక్రవారం ముంబై నగర పాలక సంస్థ (BMS) ఎన్నికల సన్నాహాలపై జరిగిన పార్టీ సమావేశానికి ఆయన డుమ్మాకొట్టారు. దీంతో అజిత్ పార్టీ వీడనున్నాడని ఊహాగానాలు మళ్లీ సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో (Karnataka) వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) స్టార్ క్యాంపైనర్ల (Star campaigners) జాబితాను పార్టీ ప్రకటించింది. ఆ జాబితాలో అజిత్ పేరు లేకపోవడం గమనార్హం. దీంతో పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
కర్ణాటకలో స్టార్ క్యాంపైనర్ల జాబితాను పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. అందులో పార్టీ అధినేత శరద్ పవార్, సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్, శివాజీరావ్ గార్జే, క్లైడే క్రాస్టో, ఆర్. హరి పేర్లు ఉన్నాయి. పార్టీ కర్ణాటక అధ్యక్షుడైన హరి.. యలబుర్గా నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు.
అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ ప్రభుత్వంలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ఈ నేపథ్యంలో ముంబైలో జరిగిన పార్టీ కీలక సమావేశానికి అజిత్ పవార్ హాజరుకాకపోవడం ఈ చర్చకు మరింత ఊతమిస్తున్నది. తాను పార్టీలోనే ఉంటానని అజిత్ పవార్ చెప్తున్నా ఆయన చుట్టూనే మహారాష్ట్ర రాజకీయాలు సాగుతున్నాయి. మరోవైపు అజిత్ పవార్‌ను మహావికాస్ అఘాడీ నేతలు అవమానిస్తున్నారని, ఆయన చిత్తశుద్ధిని శంకిస్తున్నారనే అర్థంతో బీజేపీ నేతలు అజిత్ పవార్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుండటం కూడా ఆయన బీజీపీకి దగ్గరవుతున్నారనే ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహకంగా శుక్రవారం శరద్ పవార్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎన్సీపీ కీలక నేతలంతా హాజరైనా అజిత్ పవార్ మాత్రం రాలేదు. ఇదే సమయంలో ఆయన పుణెలోని మరో కార్యక్రమంలో పాల్గొనటం చర్చనీయాంశమైంది. అయితే, ముందే షెడ్యూల్ చేసిన కార్యక్రమం ఉన్నందువల్ల ముంబై సమావేశానికి వెళ్లలేదని, అజిత్ పవార్ స్పష్టం చేశారు. అజిత్ పవార్ బీజేపీలో చేరబోతున్నారని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలను అయన ఖండించారు. అజిత్ పవార్ పార్టీలోనే ఉంటారని ఎన్సీపీ స్పష్టం చేసింది.