బారామతి, జనవరి 29: ‘అజిత్ దాదా అమర్ రహే’ నినాదాల మధ్య ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకుముందు అజిత్ దాదా కడసారి చూపు కోసం బారామతిలోని ఆయన గృహం వద్ద అభిమానులు క్యూ కట్టారు. బుధవారం విమాన ప్రమాదంలో మరణించిన అజిత్ పవార్‌కు బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ కాలేజీ గ్రౌండ్లో గురువారం పూర్తి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
పవార్ స్థాపించిన ఈ కాలేజీలో ఆయన కుమారులు పార్థ్, జేలు జరిపిన అంతిమ సంస్కారాలకు వేలాది మంది హాజరై తుది నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, శరద్ పవార్ తదితరులు హాజరయ్యారు. అంతిమ సంస్కారాల సమయంలో అజిత్ పవార్ కజిన్, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే.. పవార్ భార్య సునేత్ర పవార్ పక్కనే ఉండి ఆమెను ఓదార్చారు. కాగా ప్రమాదానికి గురైన విమానం బ్లాక్ బాక్స్ గురువారం లభ్యమైంది.
విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్థానంలో ఆయన సతీమణి సునేత్ర పవార్‌ను ప్రతిపాదించాలని ఎన్సీపీ భావిస్తున్నది. ప్రస్తుతం సునేత్ర రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.