Ajit Doval : భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు (National Security Adviser) అజిత్ దోవల్ (Ajit Doval) మొబైల్ ఫోన్ (Mobile phone) నుగానీ, ఇంటర్నెట్ (Internet) నుగానీ వాడరట. తన రోజూవారీ కార్యకలాపాల్లో వాటికి అస్సలే చోటివ్వరట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను ఇంటర్నెట్ ఉపయోగించననే మాట నిజమేనని చెప్పారు.
తాను మొబైల్ ఫోన్‌ను కూడా ఎక్కువగా వినియోగించనని, కుటుంబ సభ్యులు, ఇతర దేశాల్లోని ప్రజలతో మాట్లాడేందుకు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉపయోగిస్తానని, అది కూడా అవసరం అనుకుంటేనే అని అజిత్ దోవల్ చెప్పారు. మొబైల్, ఇంటర్నెట్ రెండూ లేకుండా విధులు నిర్వర్తించేలా ప్లాన్ చేసుకుంటానని తెలిపారు. కమ్యూనికేషన్‌కు చాలా మార్గాలు ఉన్నాయని అన్నారు.
కమ్యూనికేషన్‌కు సంబంధించి ప్రజలకు తెలియని మార్గాలు ఎన్నో ఉన్నాయని, వాటిని కూడా వారికి పరిచయం చేయాలని సూచించారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కాగా 1945లో ఉత్తరాఖండ్‌లో జన్మించిన ధోవల్.. 1968లో ఐపీఎస్‌లో చేరారు. విధుల్లో చూపిన ధైర్యసాహసాలకుగానూ కీర్తిచక్ర అందుకున్నారు.
ఆ అవార్డు అందుకున్న పిన్న వయస్కుడైన పోలీసు ఆఫీసర్ ఆయనే కావడం విశేషం. మిజోరం, పంజాబ్, ఈశాన్య ప్రాంతాల్లో చోటుచేసుకున్న తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్లలో దోవల్ కీలకంగా వ్యవహరించారు. కేరళ క్యాడర్‌కు చెందిన ఆయన నిఘా, అంతర్గత భద్రతా విభాగాల్లో ఎక్కువకాలం పనిచేశారు. జాతీయ భద్రతా నిర్ణయాల్లో కీలకపాత్ర పోషించారు. 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ స్ట్రైక్స్ వాటిలో ఉన్నాయి.