Amit Shah | కశ్మీర్ లోయలో వరుస హత్యల నేపథ్యంలో కేంద్రం అలర్టయింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. గత నెల 12 నుంచి జరుగుతున్న వరుస హత్యల నేపథ్యంలో కశ్మీర్ లోయలో భద్రతపై శుక్రవారం అమిత్‌షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కనుక అమిత్‌షాతో అజిత్ దోవల్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. అజిత్ దోవల్‌తోపాటు రా చీఫ్ సమ్నాత్ గోయల్ కూడా అమిత్‌షాతో జరిగిన భేటీలో పాల్గొన్నట్లు సమాచారం. వీరి భేటీ దాదాపు గంట సేపు జరిగినట్లు తెలుస్తున్నది.
అమిత్‌షాతో అజిత్ దోవల్, సమ్నాత్ గోయల్ సమావేశ వివరాలు వెల్లడి కాకపోయినా కశ్మీర్‌లోయలో పరిస్థితిపై చర్చించి ఉంటారని భావిస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన బ్యాంకు ఉద్యోగిని కశ్మీర్లో ఉగ్రవాదులు గురువారం కాల్చి చంపారు. దీంతో కశ్మీర్ లోయలో హత్యకు గురైన ముస్లింయేతర ప్రభుత్వోద్యోగి. శుక్రవారం జరిగే భేటీలో జమ్ముకశ్మీర్‌లో భద్రతపై అమిత్‌షా సమీక్షించనున్నారు. గత 15 రోజుల్లో కశ్మీర్లో భద్రతపై అమిత్‌షా సమీక్ష నిర్వహించడం ఇది రెండోసారి.
ఈ సమీక్షలో అజిత్ దోవల్, జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర, కేంద్ర పాలిత ప్రాంత ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. కరోనా నేపథ్యంలో రెండేండ్లుగా అమర్నాథ్ యాత్రను అనుమతించలేదు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నందున ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సాగుతుందని భావిస్తున్నారు. అమర్నాథ్ యాత్ర భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారని తెలుస్తున్నది. మరోవైపు వరుస హత్యల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ కశ్మీరీ పండిట్లు నిరసనలు తెలుపుతున్నారు.