Putin – Dhoval : అమెరికా సుంకాల మోత మోగిస్తున్నా భారత ప్రభుత్వం మాత్రం తగ్గేదేలే అంటోంది. రష్యాతో ముడిచమురు కొంటున్నందుకు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ఆంక్షలు, సుంకాలను లెక్కచేయకుండా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ (Ajit Doval) రష్యా పర్యటన వెళ్లారు. గురువారం ఆయన ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)తో భేటి అయ్యారు. మాస్కోలోని క్రెమ్లిన్ (Kremlin)లో సమావేశం అయిన ఈ ఇద్దరూ వ్యూహాత్మక భాగస్వాములుగా ఉండడంపై ఇరువురు చర్చించే అవకాశముందని రష్యాకు చెందిన న్యూస్ ఏజెన్సీ ఆర్ఐఏ వెల్లడించింది. ట్రంప్ సుంకాల నేపథ్యంలో పుతిన్, ధోవల్ భేటి ప్రాధాన్యం సంతరించుకుంది.
రష్యా, భారత్ చమురు ఒప్పందంపై మండిపడుతున్న డొనాల్డ్ ట్రంప్ సుంకాలను పెంచుతూ పోతున్నారు. ఆగస్టు 1 నుంచి 25 శాతం టారీఫ్ విధిస్తున్నట్టు చెప్పిన ఆయన.. మరోసారి సుంకాలను 25కు పెంచారు. దాంతో.. భారత్ దిగుమతి చేసుకొనే వస్తువులపై 50 శాతం సుంకాల భారం పడనుంది. అయినా సరే అమెరికా అధ్యక్షుడి హెచ్చరికలకు భయపడేది లేదని మోడీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
🇷🇺🇮🇳 #Russia’s President Vladimir Putin received #India’s National Security Advisor Ajit Kumar Doval at the Kremlin.#RussiaIndia#DruzhbaDosti@PMOIndia @narendramodi pic.twitter.com/d9Kx3OwyoY
— Russia in India 🇷🇺 (@RusEmbIndia) August 7, 2025
తమకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని, అంతర్జాతీయ విపణిలో ఎవరివద్దనైనా చమురు కొనే హక్కు తమకు ఉందని ట్రంప్ వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు ప్రధాని. ఇదే అంశంపై రష్యా అధ్యక్షుడితో మాట్లాడేందుకు జాతీయ భద్రతా సలహారు అజిత్ ధోవల్‌ను రంగంలోపి దింపారు మోడీ.