న్యూఢిల్లీ, డిసెంబర్ 17: లఖింపూర్ ఘటనపై సిట్ సమర్పించిన నివేదిక ఉభయసభలను కుదిపేసింది. ఈ ఘటనకు కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను మంత్రి వర్గం నుంచి తప్పించాలని విపక్ష సభ్యులు శుక్రవారం కూడా ఆందోళనలు కొనసాగించారు. 12 మంది ఎంపీల సస్పెన్షన్పై రాజ్యసభలో నిరసనలు హోరెత్తాయి. సభ సజావుగా నడిచేందుకు ఎంపీల సస్పెన్షన్పై ప్రభుత్వం, విపక్షాలు ఏకాభిప్రాయంతో కలిసిరావాలని చైర్మన్ వెంకయ్యనాయుడు సూచించారు. దీనికి సంబంధించి సభా నాయకుడు పీయూష్ గోయల్, విపక్షాలకు చెందిన సీనియర్ నాయకులతో తాను ఇప్పటికే చర్చించినట్టు పేర్కొన్నారు. సభను సోమవారానికి వాయిదా వేశారు.
‘సరోగసీ’సవరణలకు లోక్సభ ఓకే
విపక్షాల ఆందోళనల మధ్యే కేంద్రం మూడు బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది. క్రీడాకారులు డ్రగ్స్ తీసుకోవడాన్ని నిరోధిస్తూ కఠిన నింబంధనలు ప్రతిపాదించే నేషనల్ యాంటీ-డోపింగ్ బిల్, 2021, వన్యప్రాణుల రక్షణకు ఉద్దేశించిన వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) అమెండ్మెంట్ బిల్, 2021, సంస్థల్లో క్రమశిక్షణా యంత్రాంగాన్ని మరింత మెరుగుపర్చేలా చార్టెడ్ అకౌంటెంట్స్ చట్టం, 1949కు సవరణలు చేస్తూ తీసుకొచ్చిన చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ అండ్ కంపెనీ సెక్రటరీస్ (అమెండ్మెంట్) బిల్, 2021 ఇందులో ఉన్నాయి. అలాగే, సరోగసీ (నియంత్రణ) బిల్లు, 2019కి రాజ్యసభ సూచించిన సవరణలను లోక్సభ ఆమోదించింది. సరోగసీ విధానంపై పర్యవేక్షణ కోసం తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తూ, జాతీయ, రాష్ట్రీయ సరోగసీ బోర్డుల ఏర్పాటు కోసం తీసుకొచ్చిన ఈ బిల్లును 2019 ఆగస్టు 5న లోక్సభ ఆమోదించింది. గత వారం పలు సవరణలతో రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. తాజాగా లోక్సభ కూడా ఆ సవరణలను ఆమోదించింది.