Artificial Intelligence | న్యూఢిల్లీ: యువ గ్రాడ్యుయేట్లు టెక్ కంపెనీల్లో ఎంట్రీ లెవెల్ జాబ్స్ కోసం కృత్రిమ మేధ (ఏఐ)తో పోటీ పడక తప్పని పరిస్థితులు వచ్చేశాయి. 2022 నుంచి గూగుల్, అమెజాన్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, టెస్లా వంటి పెద్ద టెక్ కంపెనీలు.. కళాశాలల నుంచి వచ్చే కొత్త గ్రాడ్యుయేట్ల నియామకాలను సగానికి పైగా తగ్గించేశాయి. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన వెంచర్ క్యాపిటల్ సంస్థ సిగ్నల్‌ఫైర్ ఈ నెల 20న విడుల చేసిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.
జాబ్ మార్కెట్లో మార్పులు
‘స్టేట్ ఆఫ్ టెక్ టాలెంట్: 2025’ శీర్షికతో విడుదలైన ఈ నివేదిక ప్రకారం, టెక్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారిని ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో నియమించుకోవడం తగ్గిపోతున్నది. ఒకప్పుడు టెక్ కంపెనీల తలుపులు కొత్త గ్రాడ్యుయేట్ల కోసం బార్లా తెరిచి ఉండేవి. నేడు ఈ పరిస్థితి మారిపోయింది. పెద్ద టెక్ కంపెనీల్లో కొత్త గ్రాడ్యుయేట్ల నియామకాలు 2023లో 25 శాతం కాగా, 2024లో కేవలం ఏడు శాతమే. 2024లో మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్ రోల్స్‌లో నియామకాలు పుంజుకున్నాయి.
అంకురాలదీ అదే పరిస్థితి..
సిగ్నల్‌ఫైర్ తన ఏఐ ప్లాట్‌ఫాం బీకన్ ద్వారా 65 కోట్ల మంది ప్రొఫెషనల్స్, 8 కోట్ల సంస్థల డాటాను విశ్లేషించి నూతన నియామక ధోరణులను విశ్లేషించింది. స్టార్టప్ కంపెనీలు కూడా నూతన గ్రాడ్యుయేట్లను నియమించుకోవడం తగ్గించేస్తున్నాయి. టాప్ వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్ నుంచి సిరీస్ సీ ఫండింగ్‌ను తీసుకుంటున్న కంపెనీల గత నాలుగేళ్ల డాటాను విశ్లేషించినపుడు, స్టార్టప్ కంపెనీల్లో నూతన గ్రాడ్యుయేట్ల నియామకాలు 2023లో 11 శాతం నుంచి 2024లో 6 శాతానికి తగ్గిపోయాయి. కొవిడ్ మహమ్మారికి ముందు 2019లో స్టార్టప్ కంపెనీల్లో నూతన గ్రాడ్యుయేట్ల నియామకాలు 30 శాతం ఉండేవి.
కారణాలేమిటంటే?
ఎంట్రీ లెవెల్ నియామకాలు కుప్పకూలడానికి కారణాలేమిటంటే, పొదుపైన బడ్జెట్లు, ఏఐ సామర్థ్యం వృద్ధి చెందడం అని చెప్పవచ్చు. దీనికి మరో కారణం కూడా ఉంది. అదేమిటంటే, జెన్ జెడ్ (1997-2012 మధ్య జన్మించిన) వర్కర్స్ బృందంతో కలిసి పని చేయలేకపోతున్నారనే దురభిప్రాయం యాజమాన్యాల్లో ఉంది. వీరికి బదులుగా ఏఐనే ఎంచుకుంటామని 37 శాతం మంది మేనేజర్లు చెప్పారు. పెద్ద టెక్ కంపెనీల్లో నియామకాల జోరు తగ్గుదల ప్రభావం అమెరికాలోని అగ్ర శ్రేణి విశ్వవిద్యాలయాల్లో చదివిన కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లపై కూడా పడింది. చాలా రొటీన్‌గా జరిగే, ఎంట్రీ లెవెల్ కార్యకలాపాలను ఏఐ టూల్స్ చేసేస్తున్నాయి. హై లెవరేజ్ టెక్నికల్ ఔట్‌పుట్‌ను అందించే ఉద్యోగాలకు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. పెద్ద టెక్ కంపెనీలు మెషిన్ లెర్నింగ్, డాటా ఇంజినీరింగ్‌లపై గట్టిగా దృష్టి పెట్టాయి. రిక్రూటింగ్, ప్రొడక్ట్, సేల్స్ వంటి నాన్ టెక్నికల్ ఉద్యోగాల నియామకాలు కుంచించుకుపోతున్నాయి. ఇవన్నీ కలిసి జెన్ జెడ్, కెరీర్ ప్రారంభంలో ఉన్నవారికి సమస్యాత్మకంగా మారాయి.