Delhi Pollution | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ట్రిపుల్ ఇంజిన్ బీజేపీ సర్కారు ఏలుబడిలోని దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకున్నది. నగరంలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకొన్నది. సోమవారం స్థానిక పంజాబీ బాగ్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 425 మార్క్‌ను దాటినట్టు అధికారులు తెలిపారు. గాలి నాణ్యత ఈ సీజన్లో ఎన్నడూ లేనంత దారుణంగా పడిపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలి కాలుష్యంపై గత ప్రభుత్వాలను నిందించిన బీజేపీ నాయకులు.. ఇప్పుడు మాట్లాడటం లేదేంటని నగరవాసులు దుమ్మెత్తిపోస్తున్నారు. కాలుష్యానికి తోడు దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ఊపిరాడటం లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిరసనకారుల అరెస్ట్
ఢిల్లీలో గాలి నాణ్యత స్థాయిలు దిగజారుతుండటం, ప్రభుత్వాధికారులు చేష్టలుడిగి చూస్తుండిపోవడాన్ని తప్పుబడుతూ ఆదివారం ఇండియా గేట్ వద్ద స్థానికులు భారీ నిరసన చేపట్టారు. ఆప్, కాంగ్రెస్ కార్యకర్తలతోపాటు ఢిల్లీ వాసులు ఇండియా గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ‘బతికే హక్కు మాకు లేదా?’ అంటూ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమర్థవంతమైన విధానాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. దీంతో నిరసనకారులను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా నిరసనలు తెలియజేయడంతోనే అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. దీంతో పోలీసుల చర్యపై ఢిల్లీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు దేశం చైనా కూడా గతంలో వాయు కాలుష్యంతో సతమతమయ్యిందని, అయితే సమగ్ర ప్రణాళికతో దాన్ని కట్టడి చేసిందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఢిల్లీలో కూడా వాయు కాలుష్య కట్టడికి చైనా తరహా మాడల్‌ను కేంద్రప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని గుర్తు చేస్తున్నారు.
ఏమిటీ చైనా మాడల్?
చైనా రాజధాని బీజింగ్ కూడా గతంలో తీవ్రమైన వాయు కాలుష్యంతో సతమతమయ్యేది. దీంతో అక్కడి ప్రభుత్వం 2013 నుంచి 2020 మధ్యన ‘క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్’, ‘బ్లూ స్కై ప్రొటెక్షన్ క్యాంపెయిన్’ పేరిట సమగ్రమైన పాలసీలను తీసుకొచ్చింది. గాలి కాలుష్యాన్ని నేషనల్ ఎమర్జెన్సీగా ప్రకటించిన అక్కడి ప్రభుత్వం.. కాలుష్యానికి కారణమవుతున్న ఇండస్ట్రీలను మూసివేయించింది. మరికొన్నింటిని నగరానికి దూరంగా తరలించింది. బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తిని తగ్గించి విండ్, సోలార్, హైడ్రో, న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను ప్రోత్సహించింది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాడకాన్ని పెంచింది. కాలం చెల్లిన వాహనాలపై జరిమానాలు విధించింది. పౌరులు వ్యక్తిగత వాహనాల వాడకంపై ఆంక్షలు విధించి ప్రజా రవాణా వ్యవస్థలను పెంచింది. కాలుష్య ఉద్గారాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేసే అత్యాధునిక పరికరాలను సిటీ అంతటా ఇన్స్టాల్ చేసి ఉల్లంఘనలకు పాల్పడిన వారికి భారీ జరిమానాలు విధించింది. రూల్స్ మీరిన వాహనాలు, కంపెనీల లైసెన్స్‌లను రద్దు చేసింది. ఎయిర్ క్వాలిటీ పర్యవేక్షణకు శాటిలైట్ ట్రాకింగ్ వ్యవస్థను వినియోగించింది. ఇలా.. చైనా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర చర్యలతో గాలిలో పర్టిక్యులర్ మ్యాటర్ (పీఎం2.5) స్థాయిలు 60 శాతం మేర, సల్ఫర్ డైఆక్సైడ్ స్థాయిలు 90 శాతం మేర దిగొచ్చాయి. ఏడేండ్లపాటు కొనసాగిన ఈ యాక్షన్ ప్లాన్‌తో ఇప్పుడు బీజింగ్ ప్రజలు స్వచ్ఛమైన వాయువును పీల్చుకోగలుగుతున్నారు. ఢిల్లీలోనూ చైనా తరహా యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని పౌరులు డిమాండ్ చేస్తున్నారు.