Air Purifier | న్యూఢిల్లీ: ఎయిర్ కండిషనర్ నుంచి వచ్చే గాలి నాణ్యతను మెరుగుపరచడంతోపాటు, ఏసీ మన్నిక, సమర్థతలను పెంచే ఎయిర్ ప్యూరిఫయర్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఈ సరికొత్త ఏసీ ఫిల్టరేషన్ టెక్నాలజీ పీఎం 2.5-పీఎం 1 వరకు కాలుష్య కారకాలను, అలర్జీ, వ్యాధుల కారకాలను అడ్డుకోగలదు. ఈ సాంకేతికతను ఐఐటీ-బాంబే అభివృద్ధి చేసింది. దీనిని ఏఐఆర్టీహెచ్ అనే స్టార్టప్ విజయవంతంగా పరీక్షించింది. మెరుగైన ఆరోగ్యం కోసం పరిశుభ్రమైన గాలిని ఈ ఏసీలు అందిస్తాయని ఆ కంపెనీ తెలిపింది.
ఈ కొత్త సాంకేతికత కలిగిన ఏసీని నిరంతరాయంగా ఉపయోగించినపుడు, విద్యుత్తు వినియోగం సాధారణ ఏసీలతో పోల్చుకుంటే 13 శాతం తగ్గుతుందని సదరు కంపెనీ చెప్పింది. మూడు నెలల తర్వాత కూలింగ్ కెపాసిటీ నామమాత్రంగా 4 శాతం తగ్గుతుందని పేర్కొంది.
ఈ టెక్నాలజీ ఏసీ ఫ్రెండ్లీ అని తెలిపింది. ఏఐఆర్టీహెచ్ ఏసీ ప్యూరిఫయర్‌ను అమర్చిన ఏసీ నుంచి వచ్చే గాలిని పరిశీలించినపుడు…అది 1,500 సిగరెట్లు తక్కువగా కాల్చడంతో సమానమని వివరించింది. వినియోగదారుల ఊపిరితిత్తులను మాత్రమే కాకుండా, ఏసీని కూడా ఈ టెక్నాలజీ కాపాడుతుందని ఈ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ రవి కౌశిక్ చెప్పారు. ఆయన ఐఐటీ-బాంబేలో ఏరోసోల్ సైంటిస్ట్.