ముంబై, జూన్ 19: ఈనెల 21 నుంచి జూలై 15 మధ్య 16 అంతర్జాతీయ రూట్లలో విమాన సర్వీసులను తగ్గిస్తున్నామని, 3 విదేశీ గమ్యస్థానాలను నిలిపివేస్తున్నామని ఎయిరిండియా గురువారం ప్రకటించింది. ఈనెల 12న అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం తర్వాత పలు విమాన సర్వీసులలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో షెడ్యూలులో స్థిరత్వాన్ని పునరుద్ధరించి ప్రయాణికులకు చివరి నిమిషంలో అసౌకర్యాన్ని నివారించే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు టాటా గ్రూపు యాజమాన్యంలోని ఎయిరిండియా పేర్కొంది.
భారీ సైజు విమానాలతో నిర్వహించే సర్వీసులను 15 శాతం తగ్గించనున్నట్లు తెలిపింది. జూన్ 21న ప్రారంభమై జూలై 15న ఈ విమాన సర్వీసు తగ్గింపులు ముగుస్తాయని ఎయిరిండియా పేర్కొంది. ఢిల్లీ-నైరోబి, అమృత్సర్-లండన్(గాత్విక్), గోవా(మోపా)-లండన్(గాత్విక్) మధ్య విమాన సర్వీసులు జూలై 15 వరకు నిలిపివేస్తున్నట్లు వివరించింది. ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియాలోని నగరాలను కలిపే 16 అంతర్జాతీయ మార్గాలలో కూడా విమాన సర్వీసులను తగ్గనున్నట్లు ఎయిరిండియా తెలిపింది.