న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం చోటుచేసుకున్నది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం(Air India Plane)లో మంటలు చెలరేగాయి. ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం విమానంలో ఆక్సిల్లరీ పవర్ యూనిట్లో మంటలు వ్యాపించాయి. ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారు. హాంగ్‌కాంగ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఫ్లయిట్ ఏఐ 315 విమానంలో మంటలు చెలరేగినట్లు తెలిపారు. ప్రయాణికులు దిగుతున్న సమయంలో ఏపీయూ ఆటోమెటిక్‌గా షట్‌డౌన్ అయినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ప్రమాదంలో విమానం కొంత డ్యామేజ్ అయినట్లు అధికార ప్రతినిధులు తెలిపారు. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా దిగినట్లు చెప్పారు. విచారణ కోసం విమానాన్ని అక్కడే గ్రౌండ్ చేసినట్లు తెలిపారు. విమానయాన నియంత్రణ సంస్థ ఈ విషయాన్ని చేరవేసినట్లు చెప్పారు.