Air India Flight : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) నుంచి లండన్ (Landon) బయలుదేరిన ఎయిరిండియా విమానం (Air India Flight) గాల్లో వెళ్తుండగానే సాంకేతిక సమస్య తలెత్తడంతో గురువారం మధ్యాహ్నం తిరిగి జాతీయ రాజధానికి చేరుకుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిరిండియా (Air India) వర్గాలు వెల్లడించాయి. వివరాల్లోకి వెళ్తే.. ఏఐ111 విమానం గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీలో టేకాఫ్ అయింది. అయితే గాలిలో ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో అనుమానిత సాంకేతిక లోపాన్ని సిబ్బంది గుర్తించారు.
దాంతో దాదాపు ఏడు గంటల ప్రయాణం తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు విమానాన్ని తిరిగి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనపై ఎయిరిండియా ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రతకే తమ ప్రథమ ప్రాధాన్యం అని, ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని వెనక్కి పిలిపించినట్లు తెలిపారు. ప్రస్తుతం విమానానికి నిపుణులు క్షుణ్ణంగా సాంకేతిక తనిఖీలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తంచేసిన సంస్థ, వారిని వీలైనంత త్వరగా లండన్ చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు హామీ ఇచ్చింది.
ఇదిలావుంటే ఒక వార్తా సంస్థ కథనం ప్రకారం గత వారం కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మార్చి 20న ఢిల్లీ నుంచి కెనడాలోని వాంకోవర్కు బయలుదేరిన విమానం, తొమ్మిది గంటల ప్రయాణం తర్వాత తిరిగి వచ్చేసింది. ఆ మార్గంలో ప్రయాణించడానికి నిర్దిష్ట బోయింగ్ విమానానికి కెనడా ఏవియేషన్ అధికారుల నుంచి అనుమతి లేకపోవడమే ఇందుకు కారణంగా తెలిసింది.