న్యూఢిల్లీ, జూలై 12 : ఉద్దేశపూర్వక మానవ చర్య కారణంగానే ఎయిరిండియా ఫ్లైట్ 171 కూలిపోయి ఉండవచ్చునని ప్రముఖ వైమానిక భద్రతా నిపుణుడు కెప్టెన్ మోహన్ రంగనాథన్ చెప్పారు. ఇది ఆత్మహత్య అయి ఉండవచ్చునన్నారు. ఫ్యూయల్ కటాఫ్ స్విచ్‌ల అమరిక, కాక్‌పిట్ ఆడియోను పరిశీలించినపుడు ఈ భావన కలుగుతున్నట్లు తెలిపారు. పైలట్లు (మనుషులైవరైనా) తమంత తాముగా ఈ స్విచ్‌లను ఆఫ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇవి తమంతట తాము ఆటోమేటిక్‌గా స్విచాఫ్ కావన్నారు. విద్యుత్తు సరఫరా విఫలమైనప్పటికీ ఇవి స్విచాఫ్ కావని చెప్పారు. ఇవి జారిపోయే తరహా స్విచ్‌లు కాదని తెలిపారు. ఒక స్లాట్‌లో కదలకుండా ఉండేలా వీటిని డిజైన్ చేసినట్లు చెప్పారు. వీటిని పైకి లేదా కిందకు కదిలించాలంటే, వాటిని పట్టుకుని కదిలించవలసి ఉంటుందని తెలిపారు. అకస్మాత్తుగా ‘ఆఫ్’ పొజిషన్‌కు రావడమనేది ఎంత మాత్రం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇది ఓ వ్యక్తి వాటిని ‘ఆఫ్’ పొజిషన్‌కు మార్చాలని ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసుకున్న కచ్చితమైన సందర్భమని వివరించారు.
ఈ విమానంలోని కెప్టెన్ కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్నట్లు తనకు కొందరు చెప్పారని తెలిపారు. ప్రమాద నివేదికలో లోపాలు కనిపిస్తున్నాయని, దాదాపు కప్పిపుచ్చే ప్రయత్నంలాగా ఉందని అన్నారు. విమానం బయల్దేరేటపుడు, కిందకు దిగేటపుడు పైలట్లు హెడ్‌ఫోన్స్‌ను పెట్టుకోవడం తప్పనిసరి అని తెలిపారు. ఆడియో క్యామ్ 1 (కెప్టెన్) నుంచి వస్తున్నదా? క్యామ్ 2 (కో-పైలట్) నుంచి వస్తున్నదా? అనే విషయం కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ స్పష్టంగా వెల్లడిస్తుందని చెప్పారు. అస్పష్టమైన పదాలను వాడటం తప్పు దోవ పట్టించేదిగా కనిపిస్తున్నదన్నారు. ఈ చర్య ఉద్దేశపూర్వకమైనదని, అందుకే తాను ఫ్యూయల్ స్విచ్‌లను ఆఫ్ చేయడం మాన్యువల్‌గానే జరిగిందని చెప్తున్నానని వివరించారు. ఈ విమానం సిబ్బందిలో ఒకరు కొంత కాలంపాటు వైద్యపరమైన కారణాల మేరకు సెలవు తీసుకున్నారని తనకు కొందరు ఎయిరిండియా పైలట్లు చెప్పారని తెలిపారు. ఈ విషయం చాలా మంది లైన్ పైలట్లకు తెలుసునని, అటువంటపుడు ఎయిరిండియా టాప్ మేనేజ్మెంట్కు దీని గురించి తెలియనట్లయితే, ఆశ్చర్యకరమేనని చెప్పారు.