న్యూఢిల్లీ, జూన్ 26: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం తర్వాత విమాన ప్రయాణికులలో విమాన ప్రయాణమంటే భయాందోళన ఏర్పడింది. విమాన టికెట్ బుకింగ్‌లు తగ్గిపోగా, క్యాన్సిలేషన్లు పెరిగిపోయాయి. విమాన ఫోబియా నుంచి బయటపడేందుకు చాలామంది నిపుణుల సాయాన్ని తీసుకుంటున్నారు. జూన్ 12న ఎయిరిండియా ప్రమాదం తర్వాత థెరపీ కోసం విమాన ప్రయాణికుల నుంచి విపరీతమైన డిమాండ్ ఏర్పడినట్లు ఐఏఎఫ్ రిటైర్డ్ వింగ్ కమాండర్, కాక్‌పిట్ విస్టా వ్యవస్థాపకుడు దినేశ్ కే తెలిపారు.
గతంలో తన కేంద్రానికి నెలకు 10 ఫోన్ కాల్స్ వచ్చేవని, ఇప్పుడు అవి 100 దాటాయని ఆయన చెప్పారు. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత భారత్‌లో ఫ్లయింగ్ ఫియర్ కోసం సెర్చ్‌లు ఎక్కువైనట్లు గూగుల్ ట్రెండ్స్ చెబుతున్నాయి. విమాన బుకింగ్‌లు గణనీయంగా తగ్గిపోయినట్లు దేశవ్యాప్తంగా టూర్ ఆపరేటర్లు తెలిపారు. బుకింగ్‌లు 15 నుంచి 20 శాతం తగ్గిపోగా క్సాన్సిలేషన్లు 30 నుంచి 40 శాతం పెరిగాయని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ అధ్యక్షుడు రవి గోసెయిన్ తెలిపారు. ముఖ్యంగా ఎయిరిండియా రూట్లలో ఇవి ఎక్కువగా ఉన్నట్లు ఆయన చెప్పారు. డ్రీమ్‌లైనర్ విమానాల పేరు వినడానికి కూడా ప్రయాణికులు ఇష్టపడడం లేదని రవి తెలిపారు.
అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం తర్వాత విమానంలోని 11ఏ సీటుకు విపరీతమైన డిమాండు ఏర్పడింది. ఆ సీటు కోసం ప్రయాణికులు అధిక ధర చెల్లించడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఎయిరిండియాకు చెందిన డ్రీమ్ లైనర్ విమానం జూన్ 12న అహ్మదాబాద్‌లో కూలిపోగా ఒక్క ప్రయాణికుడు మినహాయించి మిగిలిన 240 మంది ప్రయాణికులు మరణించారు. 11ఏ సీటులో కూర్చున్న రమేశ్ కుమార్ విశ్వాస్ మాత్రం ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు. దీంతో చాలా మంది ప్రస్తుతం ఆ సీటు కోసం పట్టుపడుతున్నట్లు ఎకనమిక్ టైమ్స్ వార్తాకథనం పేర్కొంది.