న్యూఢిల్లీ : ఎయిరిండియా విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. వందల కుటుంబాల్లో కల్లోలం నింపింది. విమానం కూలిపోయి పేలుడు సంభవించిన తర్వాత అక్కడ ఉష్ణోగ్రత ఏకంగా 1000 డిగ్రీలకు చేరుకుంది. ఈ కారణంగానే సహాయక కార్యక్రమాలు ఆలస్యమయ్యాయని అధికారులు తెలిపారు. అంత ఉష్ణోగ్రత నుంచి మనుషులే కాదు, చివరికి శునకాలు, పక్షులు కూడా తప్పించుకోలేవని పేర్కొన్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో గురువారం మధ్యాహ్నం లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉన్నదని, అది అంటుకోవడంతో ఎవరినీ రక్షించే అవకాశం లేకుండా పోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలిపారు.
విమానం కూలిన బీజే మెడికల్ కాలేజీ వద్దకు తమ సిబ్బంది 2-2.30 గంటల మధ్యలో చేరుకున్నారని, అయితే, అప్పటికే స్థానికులు కొందరిని రక్షించి బయటకు తీసుకొచ్చారని ఎస్డీఆర్ఫ్ అధికారులు తెలిపారు. కానీ, తమ దళాలు మాత్రం లోపలికి వెళ్లలేకపోయాయని, ఒక్కరినీ కూడా రక్షించలేకపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. విమానం పేలిన వెంటనే అక్కడి ఉష్ణోగ్రత 1000 డిగ్రీలకు చేరుకోవడంతో ఎవరూ తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. తాను గతంలోనూ ఇలాంటి సంక్షోభాలు చూశానని, కానీ ఇలాంటి విపత్తును చూడటం మాత్రం ఇదే తొలిసారని అధికారి ఒకరు తెలిపారు.