Air India | ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వందలాది విమానాలు ప్రభావితమయ్యాయి. ఖతార్, బహ్రెయిన్‌తో సహా అనేక గల్ఫ్ దేశాలు ఎయిర్‌స్పేస్‌ను మూసివేశాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కాల్పుల విరమణపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరుదేశాల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం జరిగిందని ప్రకటించగా.. ఇరుదేశాలు సైతం ధ్రువీకరించాయి. పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా విమానాలను తిరిగి ప్రారంభించనున్నది. ఎయిర్ ఇండియా విమానాలను మంగళవారం నుంచి క్రమంగా పునరుద్ధరించడం మొదలుపెట్టినట్లు ఓ ప్రకటనలో ఎయిర్ ఇండియా తెలిపింది.
ఈ నెల 25 నుంచి చాలా విమాన కార్యకలాపాలు సాధారణంగా తిరిగి సాధారణ పరిస్థితికి చేరుతాయని పేర్కొంది. గతంలో రద్దు చేసిన, యూరప్‌కు బయలుదేరే విమానాలను సైతం క్రమంగా పునరుద్ధరిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. యూఎస్ ఈస్ట్ కోస్ట్, కెనడాకు సేవలు వీలైనంత త్వరగా తిరిగి ప్రారంభిస్తామని చెప్పింది. కొన్ని విమానాలు ఆలస్యం, రద్దు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. రూట్ ప్రభావం, విమాన ప్రయాణ సమయం పెరగడం వల్లనే ఈ సమస్య ఎదురైందని పేర్కొంది. అయినప్పటికీ ఎయిర్ ఇండియా అంతరాయాన్ని తగ్గించడానికి, విమాన షెడ్యూల్‌ను సాధారణ పరిస్థితికి తీసుకువచ్చేందుకు కట్టుబడి ఉందని చెప్పింది. అసురక్షితమైన గగతలాలను ఎయిర్ ఇండియా నివారిస్తుందని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి స్పష్టం చేశారు.