న్యూఢిల్లీ: యూపీలో రెండు డిస్కంలను ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ అఖిల భారత విద్యుత్తు ఇంజినీర్ల సమాఖ్య (ఏఐపీఈఎఫ్) శుక్రవారం దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. పూర్వాంచల్ విద్యుత్తు వితరణ్ నిగమ్ లిమిటెడ్ (పీవీవీఎన్ఎల్), దక్షిణాంచల్ విద్యుత్తు నిగమ్ వితరణ్ నిగమ్ లిమిటెడ్ (డీవీవీఎన్ఎల్) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ఆందోళనల్లో ఏఐపీఈఎఫ్కు చెందిన దాదాపు 27 లక్షల మంది సభ్యులు పాల్గొన్నట్టు ఆ సమాఖ్య చైర్మన్ శైలేంద్ర దూబే వెల్లడించారు.
లక్నో, వారణాసి, ఆగ్రా, చండీగఢ్, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, తిరువనంతపురం, విజయవాడ, గువాహటి, నాగ్పూర్, రాయ్పూర్, జబల్పూర్, భోపాల్, సిమ్లా, జమ్ము, శ్రీనగర్, డెహ్రాడూన్, పటియాలా, రాంచీ తదితర ప్రాంతాల్లో ఈ నిరసన కార్యక్రమాలను నిర్వహించినట్టు తెలిపారు. డిస్కంల ప్రైవేటీకరణను ఆపేవరకు నిరసనలను కొనసాగిస్తామని దూబే స్పష్టం చేశారు.