న్యూఢిల్లీ : ముస్లింలపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. భారత్లో నివసించేందుకు ముస్లింలను అనుమతించేందుకు మోహన్ భగవత్ ఎవరని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. భారత్లో ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని, అయితే వారు తామే ఉన్నతులమనే భావాన్ని వీడాలని మోహన్ భగవత్ మంగళవారం వ్యాఖ్యానించారు.
భగవత్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ వరుస ట్వీట్లలో విరుచుకుపడ్డారు. ముస్లింలు తమ విశ్వాసాలతో ఇక్కడ సర్ధుకుపోరని అన్నారు. ముస్లింలను భారత్లో నివసించేందుకు, వారి విశ్వాసాలను అనుసరించేందుకు అనుమతిచ్చేందుకు మోహన్ భగవత్ ఎవరని ఓవైసీ ప్రశ్నించారు. అల్లా కోరుకోవడంతో తాము భారతీయులమని, తమ పౌరసత్వానికి షరతులు నిర్ధేశించేందుకు ఆయనకు ఎంత ధైర్యమని నిలదీశారు.
తమ విశ్వాసాలతో సర్ధుకుపోవడానికి, నాగపూర్లోని కొందరు బ్రహ్మచారుల గుంపును సంతోషపరిచేందుకు తామిక్కడ లేమని ఓవైసీ స్పష్టం చేశారు. మీరు మీ దేశంలో విభజన చిచ్చు రేపడంలో బిజీగా ఉంటూ ప్రపంచానికి వసుధైక కుటుంబం గురించి బోధించలేరని ఓవైసీ తేల్చిచెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇతర దేశాల ముస్లిం నేతలందరినీ కౌగిలించుంటారని, కానీ తన స్వదేశంలో ఏ ఒక్క ముస్లింను హత్తుకోరని చురకలు వేశారు. ఇది మోదీ, ఆరెస్సెస్ వాక్పటిమ, విద్వేష ప్రసంగం కాక మరేమిటని ఓవైసీ నిలదీశారు.