భువనేశ్వర్: బాలుడి ఊపిరితిత్తుల్లో సూది ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. (Needle in Boy Lungs) అయితే ఓపెన్ సర్జరీతో పని లేకుండా వినూత్న వైద్య ప్రక్రియ ద్వారా ఆ సూదిని తొలగించారు. ఆ చిన్నారి ప్రాణాలు కాపాడారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలుడి ఎడమ ఊపిరితిత్తు దిగువన ఉన్న బ్రోంకస్ పార్శ్వ భాగంలో సుమారు 4 సెంటీమీటర్ల పొడవైన కుట్టు సూదిని ఎక్స్‌రే ద్వారా డాక్టర్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆ బాలుడ్ని అడ్మిట్ చేశారు.
కాగా, ఆ బాలుడి ఉపిరితిత్తులో ఉన్న సూదిని తొలగించేందుకు భువనేశ్వర్ ఎయిమ్స్‌లోని పిల్లల నిపుణుల బృందం ఓపెన్ సర్జరీతో పని లేకుండా వినూత్న పద్ధతిలో ప్రయత్నించింది. డాక్టర్ రష్మీ రంజన్ దాస్, డాక్టర్ కృష్ణ ఎం గుల్లా, డాక్టర్ కేతన్, డాక్టర్ రామకృష్ణ కలిసి బ్రోంకోస్కోపిక్ ద్వారా చాలా నైపుణ్యంగా ఆ కుట్టు సూదిని బయటకు తీశారు. ఆ బాలుడికి ప్రాణాపాయం తప్పిందని, కోలుకుంటున్నాడని డాక్టర్లు తెలిపారు.
మరోవైపు వినూత్న ప్రక్రియ ద్వారా బాలుడి ఊపిరితిత్తులోని సూదిని తొలగించిన పిల్లల డాక్టర్ల బృందాన్ని భువనేశ్వర్ ఎయిమ్స్ ఆసుపత్రి ఉన్నతాధికారులతోపాటు అంతా అభినందించారు. గాలి మార్గంలో పదునైన వస్తువును తొలగించేందుకు ఫ్లెక్సిబుల్ బ్రోంకోస్కోపీని వినియోగించినట్లు భువనేశ్వర్ ఎయిమ్స్ తెలిపింది. ఇలాంటి వైద్య విధానం తమ ఆసుపత్రితోపాటు దేశంలోని కొన్ని వైద్య కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉందని పేర్కొంది.