చెన్నై: తమిళనాడులోని అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసుపై (Anna University case) అధికార డీఎంకే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకే మధ్య మాటల యుద్ధం మొదలైంది. గత ఏడాది డిసెంబర్లో యూనివర్సిటీ ప్రాంగణంలో రెండో ఏడాది విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో డీఎంకే మద్దతుదారుడు జ్ఞానశేఖరన్‌ను చెన్నై మహిళా కోర్టు దోషిగా నిర్ధారించింది. మహిళా కోర్టు న్యాయమూర్తి ఎం రాజలక్ష్మి సోమవారం దోషికి 30 ఏళ్ల పాటు జీవిత ఖైదు విధించారు.
కాగా, అన్నాడీఎంకే అధినేత, ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి కె పళనిస్వామి ఈ తీర్పుపై స్పందించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో వ్యక్తిని రక్షించడానికి సీఎం ఎంకే స్టాలిన్, ఆయన ప్రభుత్వం ప్రయత్నించాయని ఆరోపించారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ‘సర్’ ఎవరు? ఆయన పేరు ఎందుకు తొలగించారు? ఆయనను ఎవరు కాపాడారు? అని ఎక్స్‌లో ప్రశ్నించారు.
మరోవైపు సీఎం ఎంకే స్టాలిన్ ఎదురుదాడి చేశారు. కేవలం మహిళల భద్రత గురించి శ్రద్ధ వహిస్తున్నట్లుగా ప్రతిపక్షాలు నటిస్తున్నాయని విమర్శించారు. హైకోర్టు కూడా ప్రశంసించే విధంగా దర్యాప్తు జరిగిందని తెలిపారు. ‘కేవలం ఐదు నెలల్లోనే కేసు ముగిసింది. నేరస్థుడికి కఠినమైన శిక్షను కోర్టు విధించింది. ప్రతిపక్ష నాయకులు ఈ సంఘటనను రాజకీయం చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
Also Read: