చెన్నై, మే 12: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విపక్షానికి చెందిన ఏఐఏడీఎంకేలో తిరుగుబాటు మొదలై చీలికకు దారితీసింది. ఏఐఏడీఎంకే బద్ధ శత్రువు డీఎంకేతో చేతులు కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీ చీఫ్ ఎడప్పాడి కే పళనిస్వామి చేసిన ప్రయత్నాలను నిరసిస్తూ ఎస్పీ వేలుమణి, సీ వే షణ్ముగం నేతృత్వంలో సుమారు 30 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీపై తిరుగుబాటు చేసి సీఎం విజయ్‌కు మద్దతు ప్రకటించారు. బుధవారం అసెంబ్లీలో జరిగే విజయ్ విశ్వాస పరీక్షలో తాము ఆయనకు మద్దతు తెలుపుతామని పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్ 23న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 164 సీట్లలో పోటీ చేసిన ఏఐఏడీఎంకే 47 సీట్లలో విజయం సాధించింది. డీఎంకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పళనిస్వామి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. దీనిని పార్టీలోని చాలామంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించారన్నారు. ఏఐఏడీఎంకే ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా తీసుకునే ఎలాంటి ప్రతిపాదననైనా తాము వ్యతిరేకిస్తామన్నారు.
రెబల్ నేత షణ్ముగం చేసిన ఆరోపణలను ఏఐఏడీఎంకే నాయకత్వం వదంతులుగా కొట్టివేసింది. ఆయా జిల్లాల్లో విజయం సాధించడంలో విఫలమైన నేతలు అబద్ధాల మూటలు విప్పుతున్నారని ఎక్స్‌లో ఆరోపించింది. అసమ్మతి నేతలు వేలుమణి, షణ్ముగం, సీ విజయ్ భాస్కర్ టీవీకే ప్రభుత్వంలో మంత్రి పదవులు ఆశిస్తున్నారని పేర్కొన్నది. మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ రెబల్ ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. రెబల్ వర్గానికి నేతృత్వం వహిస్తున్న వీ షణ్ముగం ఇంటికి చేరుకున్న విజయ్ ఆయనను సన్మానించి, అక్కడి రెబల్ శాసనసభ్యులతో మాట్లాడారు.
తమిళనాడులో మద్య నిషేధం విధించాలంటూ మహిళలు, కొన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న వేళ తమిళనాడు ముఖ్యమంతి సీ జోసఫ్ విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రార్థ నా స్థలాలు, విద్యాసంస్థలు, బస్సు స్టాండ్కుఏ 500 మీటర్ల దూరంలో ఉండే మద్యం షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. 717 మద్యం దుకాణాలను రెండువారాల్లో మూసివేయాలని ఆదేశించారు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని అన్నారు.