న్యూఢిల్లీ: కృత్రిమ మేధస్సు(ఏఐ) మన జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. అయితే ఏఐ త్వరలోనే ఆందోళనకరమైన సమస్యలకు దారితీయవచ్చని ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడెయ్ పేర్కొన్నారు. అమోడెయ్ బుధవారం తన ‘పాలసీ ఆన్ ది ఏఐ ఎక్స్పోనెన్షియల్’ వ్యాసంలో తీవ్రమైన సైబర్ దాడి ముప్పులను సృష్టించడం నుంచి జీవాయుధాలకు మూలంగా మారడం వరకు కొన్ని అత్యంత బలమైన హెచ్చరికలను జారీ చేశారు. ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు అందుకోలేనంత వేగంగా ఈ సాంకేతికత అభివృద్ధి చెందుతున్నదని అమోడెయ్ స్పష్టం చేశారు. కేవలం ఒకట్రెండు ఏండ్లలోనే ఏఐ అద్భుతమైన రీతిలో పరిణామం చెందిందని, త్వరలోనే ఇది ఆయన అభివర్ణించినట్టుగా ‘డాటా సెంటర్లోని ప్రతిభావంతులైన దేశం’ స్థాయికి చేరుకోవచ్చని వాదించారు. అనేక రంగాల్లో మానవులను మించిపోయే అత్యంత సామర్థ్యం గల ఏఐ వ్యవస్థలను ఉద్దేశించి ఆయన ఈ హెచ్చరిక చేశారు.
ఆయన చేసిన అత్యంత తీవ్రమైన హెచ్చరికల్లో ఒకటి.. అధునాతన ఏఐ వ్యవస్థలు జీవ సంబంధిత ముప్పులకు కారణం కావచ్చు. ఆర్థిక వ్యవస్థలు, కీలకమైన మౌలిక సదుపాయాలు, జాతీయ భద్రతను ప్రభావితం చేయగల సైబర్ సెక్యూరిటీ ముప్పులను ఏఐ మోడల్స్ సృష్టించగలవని ఇటీవలి ఆవిష్కరణలు చూపుతున్నాయని ఆంత్రోపిక్ సీఈవో ఎత్తి చూపారు. “జీవసంబంధిత ముప్పులు త్వరలోనే రావచ్చు, తీవ్రమైన ఏఐ స్వయంప్రతిపత్తి ముప్పులు కూడా ఎంతో దూరంలో లేవని నేను నమ్ముతున్నాను” అని ఆయన నొక్కి చెప్పారు.
ముఖ్యంగా ఏఐ ఉద్యోగాలను లాగేసుకుంటుందనే తన అభిప్రాయానికి అమోడెయ్ కట్టుబడి ఉన్నారు. ఆయన ప్రకారం.. ప్రస్తుతం మానవులు చేసే వివిధ మేధోపరమైన పనులకు ఏఐ ప్రత్యామ్నాయంగా మారవచ్చు. ఇది ఉద్యోగ మార్కెట్లో శాశ్వత అంతరాయాలకు దారితీసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. “శాశ్వత ఉద్యోగ నష్టం అనేది అవాంఛనీయం, ప్రమాదకరం. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఏఐ కారణంగా గణనీయమైన స్థాయిలో శాశ్వత ఉద్యోగ నష్టం సంభవించే ప్రమాదం ఉన్నది” అని అన్నారు. ప్రభుత్వాలు ఉపాధిపై ఏఐ ప్రభావాన్ని పర్యవేక్షించడం ప్రారంభించాలని, నష్టపోయిన కార్మికులకు సహాయక వ్యవస్థలను సిద్ధం చేయాలని ఆయన సూచించారు.
ఆర్థిక ఆందోళనలతోపాటు మరింత నియంత్రణ కోరుకునే నియంతృత్వ ప్రభుత్వాలకు, ఇతర శక్తులకు అధునాతన ఏఐ ఒక శక్తివంతమైన సాధనంగా మారవచ్చని అమోడెయ్ హెచ్చరిస్తున్నారు. “తప్పుడు చేతుల్లో పడే శక్తివంతమైన ఏఐ అనేది నిరంకుశత్వానికి అంతిమ సాధనం కావచ్చు. నిఘా కేంద్రీకృత ఏఐ విస్తృతంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని భారీ ఎత్తున విశ్లేషించగలదు, ప్రతి పౌరుడి జీవితంలోని అత్యంత అంతర్గత వివరాలను ఊహించడానికి దానిని ఉపయోగించవచ్చు” అని పేర్కొన్నారు.