AI Advisory | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీని జారీ చేసింది. ఇకపై ఎవరైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, అడ్వైజరీ అన్ని కంపెనీలకు ఒకేలా ఉండదు. ఇది కేవలం పెద్ద టెక్ కంపెనీలకు మాత్రమేనని.. చిన్న స్టార్టప్‌లకు కాదని కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇటీవల గూగుల్ ఏఐ టూల్ జెమినీ ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఏఐ కోసం అడ్వైజరీ అవసరమని అనిపించిందని.. ఈ మేరకు టెక్ కంపెనీలు పని చేయాలని ఉంటుందని కేంద్రం పేర్కొంది. ఇందులో విఫలమైతే కంపెనీలపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఉంటుందని హెచ్చరించింది. అడ్వైజరీ ప్రకారం.. ఏఐ మోడల్స్, లాగ్వేంజ్ మోడల్స్, జనరేటివ్, అల్గారిథమ్‌లను ఉపయోగించి ఇంటర్నెట్లో తప్పుడు కంటెంట్ వ్యాప్తిని అనుమతించకుండా అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ చూసుకోవాల్సి ఉంటుంది. భారతీయ ఇంటర్నెట్లో విశ్వసనీయత లేని ఏఐ టూల్ ఉపయోగించబడదని.. అలా కాకుండా ఏదైనా టూల్ పబ్లిష్ చేసే ముందుసరిగా పరీక్షించుకోవాలి.. ఏదైనా టూల్‌ను ప్రారంభించే ముందు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిందని స్పష్టం చేసింది.